బాలీవుడ్ నటి, పాకిజా ఫేమ్ గీతా కపూర్ (57) ఇక లేరు. బాలీవుడ్లో 100కుపైగా చిత్రాల్లో నటించిన గీతా కపూర్ జీవితం చివరి దశలో ఎవ్వరూ లేని అనాథగా ఓ వృద్ధాశ్రమలో కన్నుమూశారు. గీతా కపూర్‌కి ఓ కొడుకు, కూతురు వున్నారు. కొడుకు రాజా కపూర్ సినిమాల్లోనే కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తోండగా కూతురు పూజ ఎయిర్ హోస్టెస్‌గా స్థిరపడింది. అయితే, ఇద్దరు పిల్లలు వున్నా కానీ తనని ఎవ్వరూ పట్టించుకోకపోవడం ఆమెను కుంగదీసింది. తనని వృద్ధాశ్రమం నుంచి తీసుకెళ్లేందుకు ఏదో ఓ రోజు తన కొడుకు వస్తాడని ఎదురుచూసి, ఎదురుచూసి, ఆమె అదే దిగులుతోనే మంచం పట్టి చనిపోయారు అని గీతా కపూర్‌ని వృద్దాశ్రమంలో చేర్చిన బాలీవుడ్ ఫిలింమేకర్ అశోక్ పండిట్ తెలిపారు. గీతా కపూర్ కి నివాళి అర్పిస్తూ ఆమె ఇక లేరు అని అశోక్ పండిట్ చెప్పేంత వరకు ఆమె చనిపోయిన సంగతి కూడా బయటి ప్రపంచానికి తెలియలేదు. నటిగా 100కుపైగా చిత్రాలు చేసిన గీతా కపూర్‌కి పాకిజా, రజియా సుల్తానా వంటి చిత్రాలు బాగా పేరు తీసుకొచ్చాయి.
ఏడాది క్రితం అనారోగ్యంతో బాధపడుతున్న గీతా కపూర్‌ని ఎస్ఆర్వీ హాస్పిటల్లో చేర్పించిన ఆమె కొడుకు రాజా.. డబ్బులు డ్రా చేసుకుని వస్తానని వెళ్లి ఇక ఆస్పత్రికి తిరిగిరాలేదు. అలా ఆస్పత్రిలో ఒంటరిగా మిగిలి కొడుకు, కూతురు ఉండగానే అనాధగా మారిన గీతా కపూర్ ఇక లేరు అని అశోక్ పండిట్ పేర్కొన్నారు.
కొడుకు ఆస్పత్రిలో వదిలి వెళ్లడంతో ఆమె దీన స్థితి గురించి తెలుసుకున్న అశోక్ పండిట్, మరో నిర్మాత రమేష్ తౌరానీ ఆమె ఆస్పత్రి బిల్లులు చెల్లించి, తీసుకెళ్లి ఓ వృద్ధాశ్రమంలో చేర్పించారు. గత ఏడాది కాలంగా ఆమె బాగోగులను చూసుకుంటూ వచ్చారు. అయితే, ఎప్పటికైనా తన కొడుకు చేసిన తప్పు తెలుసుకుని తిరిగొచ్చి తనని ఇంటికి తీసుకెళ్తాడని కొడుకు కోసం చివరి క్షణం వరకు ఎదురుచూసిన గీతా కపూర్ ఆ దిగులుతోనే కన్నుమూశారు అని అశోక్ పండిట్ తెలిపారు.
అన్నింటికన్నా బాధాకరమైన విషయం ఏంటంటే, గీతా కపూర్ పార్థివదేహాన్ని మరో రెండు రోజులపాటు కూపర్ హాస్పిటల్లో భద్రపరుస్తామని, ఆమె అంతిమ సంస్కారం చేసేందుకు కుటుంబసభ్యులు ఎవ్వరూ ముందుకు రాకపోతే, సోమవారం ఆమె అంత్యక్రియలు జరిపిస్తాం అని పండిట్ చెప్పారు.