2018 అనగా నూతన సంవత్సరంలో సినీ అభిమానులను కనువిందు చేయడానికి అనేక బాలీవుడ్ చిత్రాలు ముస్తాబవుతున్నాయి. అందులో ఇప్పటికే కొన్ని ఆసక్తికరమైన చర్చలను రేపగా.. మరికొన్ని వివాదాల చుట్టూ కూడా పయనించాయి. ఈ క్రమంలో 2018లో చూడదగ్గ టాప్ టెన్ బాలీవుడ్ చిత్రాల గురించి మనం కూడా తెలుసుకుందాం..!
శింబా - తెలుగు చిత్రం 'టెంపర్' ఆధారంగా హిందీలో రణవీర్ సింగ్ హీరోగా తెరకెక్కబోయే చిత్రమే 'శింబా'. ఈ చిత్రానికి రోహిత్ శెట్టి దర్శకత్వం వహించనున్నారు. కరణ్ జోహార్ నిర్మించే ఈ చిత్రంలో సంగ్రామ్ భలేరావ్ పాత్రలో రణ్‌వీర్ సరికొత్తగా తన అభిమానులను అలరించనున్నారు. 2018 సంవత్సరం ద్వితీయార్థంలో ఈ చిత్రం విడుదల అయ్యే అవకాశం ఉంది.
సంజు - బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జీవితకథ ఆధారంగా తెరకెక్కబోయే చిత్రం పేరే 'సంజు'. ఇందులో రణ్‌బీర్ కపూర్, సంజయ్ పాత్రలో నటించబోతున్నారు. విధువినోద్ చోప్రా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించనున్నారు.
ప్యాడ్ మాన్ - పద్మన్ లేదా ప్యాడ్ మ్యాన్ పేరుతో ఆర్ బల్కి దర్శకత్వంలో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం 26 జనవరి, 2018 తేదిన ప్రేక్షకుల ముందుకు రానుంది.మహిళల కోసం అతి తక్కువ ధర కలిగిన సానిటరీ ప్యాడ్ మేకింగ్ యంత్రాన్ని కనిపెట్టిన అరుణాచలం మురుగనంతం జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అక్షయ్ సరసన రాధిక ఆప్టే, సోనమ్ కపూర్ నటిస్తున్నారు.
పద్మావత్ - సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో దీపికా పదుకొనే ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'పద్మావతి'. అయితే పలు వివాదాల వల్ల ఈ చిత్ర విడుదల 2017లో ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే కోర్టు తాజాగా ఈ చిత్రాన్ని 'పద్మావతి' పేరుతో కాకుండా 'పద్మావత్' పేరుతో విడుదల చేయాలని తెలిపింది. కనుక, 2018లో ఈ చిత్రం ప్రేక్షకుల మందుకు రానుందని చెప్పుకోవచ్చు.
ముక్కాబాజ్ - అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వినీత్ కుమార్ సింగ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే పలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శితమైన ఈ చిత్రం, 2018లో తొలిసారిగా భారత్‌లో విడుదల కానుంది.
మణికర్ణిక - దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో కంగనా రనౌత్ హీరోయిన్‌గా, ఝాన్సీ లక్ష్మీబాయి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమే 'మణికర్ణిక'. ఈ చిత్రం కూడా 2018లోనే విడుదల కానుంది
రేస్ 3 - సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్, బాబీ డియోల్ ప్రధాన తారాగణంగా రెమో డిసౌజా దర్శకత్వంలో తెరకెక్కతున్న చిత్రమే 'రేస్ 3'. ఈ చిత్రాన్ని 2018 జూన్ నెలలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు
దడక్ - షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ మరియు శ్రీదేవి కుమార్తె జాహ్నవి తెరంగేట్రం చేస్తున్న 'దడక్' చిత్రం కూడా 2018లో విడుదలకు సన్నద్ధమవుతోంది. శశాంక్ కైతాన్ దర్శకత్వం వహించే ఈ సినిమాని ధర్మా ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
గోల్డ్ - ఒలింపిక్స్‌లో భారత జట్టుకు సారధ్యం వహించి మూడుసార్లు పతకాలు తీసుకొచ్చిన హాకీ టీమ్‌లో సభ్యుడైన బల్బీర్ సింగ్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రధాన పాత్రను అక్షయ్ కుమార్ పోషిస్తున్నారు. రీమా కగ్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
2.0 - రజనీకాంత్ కథానాయకుడిగా హిందీతో పాటు తమిళ, తెలుగు భాషలలో తెరకెక్కిన చిత్రమే 2.0. శంకర్ దర్శకత్వం వహించే ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ కూడా ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రం కూడా 2018లో విడుదల కానుంది.