రాజ్యసభలో ఏపీ సభ్యుల ఆందోళన కొనసాగించారు. విభజన హామీలపై తక్షణమే చర్చ జరగాల్సిందేనంటూ టీడీడీ, వైసీపీ సభ్యులు మరోమారు పట్టుబట్టారు. శాంతించాలని పదే పదే రాజ్యసభ ఛైర్మన్ కోరినప్పటికీ అంగీకరించని సభ్యులు.. హామీలను నెరవేర్చాలంటూ నినాదాలు చేశారు. రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు వారించినా సభ్యులు వెనక్కి తగ్గలేదు. ఒకవైపు వైసీపీ ఎంపీలు వారి స్థానాల్లో నుంచే నిరసన వ్యక్తం చేయగా..మరోవైపు టీడీపీ సభ్యులు మరింత దూకుడు పెంచి వెల్ లోకి దూసుకొచ్చి నినాదాలు చేశారు. ఏపీ సమస్యలపై స్వల్పకాలిక చర్చను చేపట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఎంతగా వారించినా సభ్యులు వెనక్కి తగ్గలేదు...దీంతో సభ్యుల తీరుపై వెంకయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.. మీ గోల ఎవరూ వినడం లేదని... మీ ఆందోళనను ఎవరూ పట్టించుకోవడం లేదని... ఇంకా ఎందుకు అరుస్తారంటూ వెంకయ్య మండిపడ్డారు. అనంతరం టీవీ ప్రసారాలను ఆపివేయాలంటూ వెంకయ్య ఆదేశించారు. దీంతో, కొద్ది సేపు టీవీ ప్రసారాలు ఆగిపోయాయి. ఆ తర్వాత సభ ప్రారంభమైన కాసేపటికే సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు వెంకయ్య ప్రకటించారు. కాగా ఏపీ విభజన హామీలపై రేపు స్వల్పకాలిక చర్చను చేపట్టనున్నారు.