గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీ అసెంబ్లీ అభ్యర్ధిగా నారా లోకేష్ నామినేషన్ దాఖలు చేశారు. మంగళరిగిలోని తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు. నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి స్వీకరించారు. లోకేశ్‌తో ఆయన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి, కొడుకు దేవాన్ష్ ఉన్నారు.
టీడీపీ అధినేత తనయుడు కావడంతో నారా లోకేష్ నామినేషన్ కార్యక్రమాన్ని పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ సందర్భంగా లోకేశ్ వెంట టీడీపీ నేతలు, భారీ సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు . నారా లోకేష్ రాకతో తహసీల్దార్ కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. కార్యకర్తలు పెద్ద ఎత్తున లోకేష్ కు అనుకూలంగా నినాదాలు చేశారు
అంతకుముందు లోకేష్ తన నివాసంలో తల్లిదండ్రులకు పాదాభివందనలు చేసి నామినేషన్ వేసేందుకు బయల్దేరారు. తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న లోకేష్ తన తల్లిదండ్రుల వద్ద ఆశీర్యవాదం తీసుకున్నారు. అనంతరం భార్య బ్రహ్మణీ కొబ్బరికాయతో దిష్టి తీసి నారా లోకేష్‌కు ఎదురు వచ్చారు. అనంతరం లోకేష్ నామినేషన్ వేసేందుకు బయల్దేరి వెళ్లారు.