కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై టీడీపీ నేతలు మండిపడుతోన్న సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ బడ్జెట్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కేంద్రంతో దోస్తీకి కటాఫ్ చెప్పాలా?వద్దా? అనే అంశంపై ఆదివారం కీలక భేటీని నిర్వహించనున్నారు. అందరూ ఎంపీలు, ఎంఎల్ఏలు, సీనియర్ నాయకులు తప్పనిసరిగా హాజరుకావాలని చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో రాజకీయాలు ఇంతలా వేడెక్కి ఉంటే.. తాజా బడ్జెట్‌పై చంద్రబాబు కోడలు, ఏపీ మంత్రి నారా లోకేశ్ భార్య, హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జికూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి స్పందించారు. విశాఖపట్నంలో ఓ వర్క్ షాప్ లో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేటాయింపులు బాగున్నాయని అన్నారు.
ఆక్వా, మత్స్య, పాడి పరిశ్రమలకు పెద్దపీట వేయడం శుభ పరిణామమని తెలిపారు. కిసాన్ కార్డులు వ్యవసాయదారులకే కాకుండా ఆక్వా, మత్స్య, పాడి పరిశ్రమలకు కూడా ఇవ్వడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని అన్నారు. ఈ ఏడాది మత్స్య, పాడి పరిశ్రమ కోసం మరో 10వేల కోట్లు అదనంగా కేటాయించారని అన్నారు.