లోక్ సభలో గందరగోళ పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో అవిశ్వాసంపై చర్చించకుండానే స్పీకర్ సభను వాయిదా వేశారు. ఉదయం సభ ప్రారంభం కాగానే టీఆర్ఎస్, అన్నాడీఎంకే, టీడీపీ ఎంపీల ఆందోళన నేపథ్యంలో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. కాగా వాయిదా అనంతరం ప్రారంభమైన లోక్ సభ మళ్లీ విపక్ష సభ్యుల నినాదాలతో మార్మోగింది.
కావేరీ రివర్ బోర్డు ఏర్పాటు చేయాలని అన్నాడీఎంకే ఆందోళన చేపట్టగా..రిజర్వేషన్లపై చర్చించాలని టీఆర్ఎస్ సభ్యులు వెల్ లో కి దూసుకెళ్లి ప్లకార్డులు ప్రదర్శించారు. ఇదే సమయంలో అవిశ్వాసంపై చర్చ జరగాలని టీడీపీ ఎంపీలు పట్టుబట్టారు.
వైసీపీ టీడీపీల అవిశ్వాస తీర్మానం నోటీసులు అందుకున్న స్పీకర్.. సభ్యులు సహకరిస్తేనే అవిశ్వాసం పై చర్చ సాధ్యమౌతుందన్నారు. గందరగోళ పరిస్థితుల్లో అవిశ్వాసంపై ఓటింగ్ నిర్వహించలేమన్నారు. సభ సజావుగా సాగేందుకు సభ్యులు సహకరించాలని టీఆర్ఎస్, అన్నాడీఎంకే సభ్యులను స్పీకర్ వారించినప్పటికీ సభ్యులు వెనక్కితగ్గలేదు. దీంతో సభను రేపటికి వాయిదా వేస్తన్నట్లు స్పీకర్ ప్రకటించారు. ఇలా హైడ్రామా నడుమ అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగకుండా సభ వాయిదా పడింది.