Kotamreddy Sridhar Reddy Security Reduced: ప్రభుత్వం తన ఫోన్ ట్యాపింగ్ చేస్తుందంటూ సంచలన ఆరోపణలు గుప్పించిన నెల్లూరు రూరల్ వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఏపీ సర్కారు షాకిచ్చింది. కోటంరెడ్డికి భద్రతను తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న 2+2 గన్మెన్లను 1+1 తగ్గించారు పోలీస్ అధికారులు. శ్రీధర్ రెడ్డికి బెదిరింపు కాల్స్ వస్తున్న నేపథ్యంలో భద్రత తగ్గింపుపై అనుచరులు అసహన వ్యక్తం చేస్తున్నారు. భద్రత తగ్గింపు పత్రంపై శ్రీధర్ రెడ్డి సంతకం పెట్టారు.
అధికార పార్టీలో ఉన్న తన ఫోన్‌నే అధికారులు ట్యాపింగ్ చేస్తున్నారని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చేసిన సంచలన ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. వైఎస్ కుటుంబానికి విధేయుడిగా ఉన్న తననే అవమానించారంటూ ఆయన ఆవేదన చెందారు. దీంతో వైసీపీ నుంచి బయటకు వస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేయనని ప్రకటించారు. కోటంరెడ్డికి మద్దతుగా నెల్లూరు మేయర్ స్రవంతి కూడా రాజీనామాకు సిద్ధమయ్యారు. శ్రీధర్ అన్నతోనే తన ప్రయాణం అని స్పష్టంచేశారు. కోటంరెడ్డికి సపోర్ట్‌గా మరికొంత మంది కార్పొరేటర్లు ముందుకు వస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయనకు భద్రతను తగ్గించడం చర్చనీయాంశంగా మారింది.
జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉన్నారు. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరపున విజయం సాధించి పార్టీలో కీలక నేతగా ఎదిగారు. 2019లో కేబినెట్లో చోటు దక్కుతుందని ఆశించి భంగపడ్డారు. ఆ తరువాత మళ్లీ మంత్రి మండలి విస్తరణలో అయినా ఛాన్స్ దక్కుతుందని భావించగా.. మళ్లీ నిరాశే ఎదురైంది. దీంతో ఆయన అప్పటి నుంచి అధిష్టానంపై గుర్రుగానే ఉన్నారు. గత నెలలోనే కోటంరెడ్డిని సీఎం జగన్ పిలుపుంచుకుని మాట్లాడారు. కొన్ని రోజులు సైలెంట్‌గా ఉన్న ఆయన.. మళ్లీ సంచలన ఆరోపణలతో రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారారు.
జగన్ సర్కారుపై అసంతృప్తి గళం వినిపించిన ఎమ్మెల్యేలకు ప్రభుత్వం భద్రత తగ్గిస్తుందనే విమర్శలు వస్తున్నాయి. ఇటీవలె ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి భద్రత తగ్గించగా.. తాజాగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి భద్రత తగ్గింపు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. కోటంరెడ్డి వరుస ప్రెస్మీట్లతో వైసీపీ అధిష్టానంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తుండగా.. వైసీపీ నేతలు కూడా అదేస్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు.
Also Read: YSRTP: బీఆర్ఎస్కు షాక్.. వైఎస్ఆర్టీపీలోకి కీలక నేత.. ముహుర్తం ఖరారు
Also Read: Nellore Mayor Sravanthi: నెల్లూరులో వైసీపీకి మరో షాక్.. కోటంరెడ్డికే జై కొట్టిన మేయర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook