AP Weather Report: భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం మాల్దీవుల నుండి మధ్య మహారాష్ట్ర వరకు కర్ణాటక మీదుగా సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతోందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న నాలుగు రోజులు పాటు అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంబేద్కర్ వెల్లడించారు. వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యే రైతులు, పశువుల కాపరులు ప్రమాదాలు, పిడుగుపాటు బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సమయంలో ఎవ్వరూ చెట్ల కింద నిలబడవద్దని డా.బి.ఆర్ అంబేద్కర్ హెచ్చరించారు.
ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురువనుండటంతో పాటు పిడుగులు పడే ప్రమాదం కూడా ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తప్పనిసరి అవసరం అయితే తప్ప ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే సమయంలో ప్రజలు ఎవ్వరూ అనవసరంగా బయటికి రాకూడదని వర్షాభావం అధికంగా ఉన్న ప్రాంతాల అధికార యంత్రాంగం అక్కడి ప్రజలను అప్రమత్తం చేస్తోంది.
రానున్న నాలుగు రోజులు పాటు రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురువనుండటంతో వాతావరణం కొంత చల్లబడి, ఇప్పటివరకు నమోదైన అధిక ఉష్ణోగ్రతలు కొంతమేరకు తగ్గనున్నాయని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు.
ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. రేపటి శనివారం ఉత్తరాంధ్ర, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, అనంతపురం, కర్నూల్, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది.