Night curfew in Andhra Pradesh: విజయవాడ: ఏపీలో రోజురోజుకు భారీ సంఖ్యలో పెరిగిపోతున్న కరోనావైరస్ పాజిటివ్ కేసులను కట్టడి చేసేందుకు ఏపీ సర్కారు కూడా ఇతర రాష్ట్రాల తరహాలోనే కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 24వ తేదీ, శనివారం నుంచి రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను అమలు చేయనున్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ప్రకటించారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ కర్ఫ్యూ అమలులో ఉంటుందని మంత్రి ఆళ్ల నాని తెలిపారు.
నైట్ కర్ఫ్యూ సమయంలో దుకాణాలు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు మూసి వేయడంతో పాటు ప్రజా రవాణా సైతం స్థంభించిపోనుంది. రోగుల సహాయార్థం ఫార్మసీలు, డయాగ్నస్టిక్స్ ల్యాబోరేటరీలు, మీడియా సంస్థలు, పెట్రోల్ బంకులు, శీతల గిడ్డంగులు, గోదాములు, ఇతర అత్యవసర సేవలు నైట్ కర్ఫ్యూ సమయంలోనూ అందుబాటులో ఉండనున్నాయి.
శుక్రవారం మంత్రి ఆళ్ల నాని మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా నివారణ కోసం సీఎం వైఎస్ జగన్ (AP CM YS Jagan) అన్ని చర్యలు తీసుకుంటున్నారని అని అన్నారు. అలాగే కొన్ని ఆస్పత్రుల్లో, డయాగ్నిగ్స్టిక్స్ సెంటర్స్‌లో సిటీ స్కాన్స్కి (CT Scan charges) అధిక మొత్తంలో చార్జీలు వసూలు చేస్తున్నట్టు తమకు ఫిర్యాదులు అందాయని, అలాంటి వారిపై తగిన చర్యలకు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.