ఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన తొలిబడ్జెట్లో గృహ కొనుగోలు దారులకు ఓ తీపికబురు వినిపించారు. సభలో ఆమె మాట్లాడుతూ మార్చి 2020 వరకు రూ. 45 లక్షలలోపు గృహాల కొనుగోలుకు రుణాలు తీసుకొన్న వారికి వడ్డీ చెల్లింపులో అదనంగా రూ.1.5 లక్షల మేరకు ఆదాయపుపన్ను రాయితీ లభించనుందని ప్రకటించారు. ఈ విధానంతో గృహరుణాలపై లభించే ఆదాయపుపన్ను రాయితీ రూ.3.5 లక్షలకు చేరుకొంటుంది. దేశంలో ప్రతి ఒక్కరికీ ఇల్లు సమకూర్చడమే లక్ష్యంగా ఈ మేరకు మార్పులు తీసుకొచ్చినట్లు ఆర్ధిక మంత్రి వివరించారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో బంగారం, ఇతర ఖరీదైన లోహాల కొనుగోలుపై సుంఖాన్ని పెంచారు. వాటిపై కస్టమ్స్ సుంకాన్ని 12.5 శాతం విధించారు. తాజా విధానంతో మహిళలు ఇష్టపడే బంగారం ధరలు కాస్త ప్రియం కానున్నాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం ప్రకారం వీటిపై 10శాతం సుంకాన్ని విధిస్తున్నారు. తాజా పెంపుతో మరో 2.5 శాతం పెంచినట్లయింది. ఇదిలా ఉండగా ఇప్పటికే రూపాయి బలహీనపడటం, చమురు ధరలు తక్కువగా వంటి కారణాల చేత బంగారం ధర భారీగా పెరిగింది. ఇప్పుడు ఈ పన్నులూ తోడయితే మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.