AP Congress: ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో అసలు శాసన సభలో కనీస ప్రాతినిధ్యం లేని దుస్థితిలో ఉంది. రాష్ర్ట విభజన అంశం కాంగ్రెస్ ను ఏపీలో ఆ పార్టీని పూర్తిగా దెబ్బతీసింది. అంత వరకూ అధికారంలో ఉన్న పార్టీ ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు కూడా సంపాదించ లేకపోయింది. ఒక విధంగా చెప్పాలంటే ఏపీ ప్రజలు కాంగ్రెస్ ను కూకటి వేళ్లతో పెకిలించారనే చెప్పవచ్చు. మహా మహా నాయకులు సైతం డిపాజిట్లు కూడా దక్కలేదు. వందేళ్ల కాంగ్రెస్ చరిత్రలో గతంలో ఎప్పుడూ ఎరగనంత ఓటమిని ఆంధ్రప్రదేశ్ హస్తం పార్టీ చవిచూసింది. విభజన జరిగి పదేళ్లు అయినా ఇంకా కాంగ్రెస్ ను ఏపీ ప్రజలు విశ్వసించడం లేదు. వరుసగా మూడు ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఒక్కటంటే ఒక్క సీటు దక్కలేదు. ఏపీలో కాంగ్రెస్ ను దెబ్బ కొట్టిన అంశాల్లో విభజన ఒకటైతే మరొక ప్రధాన అంశం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ రెండు అంశాలు కాంగ్రెస్ కు భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశాయి. ఏపీలో టీడీపీ కాంగ్రెస్ రెండు మాత్రమే ప్రధాన పార్టీలుగా ఉండేవి. విభజనతో కాంగ్రెస్ లోని ముఖ్య నాయకులందరూ వైస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. మిగితా వారు మాత్రం పార్టీలో ఉన్నా లేనట్లుగా రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు.
అయితే రాజకీయాల్లో పరిస్థితులు ఎప్పుడూ ఒక లాగానే ఉండవు. నేడు బలంగా కనిపించిన పార్టీ రేపు పూర్తిగా బలహీనంగ మారవచ్చు. అదే సమయంలో అసలు పార్టీయే అంతర్థానం అవుతుందనుకుంటున్న తరుణంలో తిరిగి అధికారంలోకి రావొచ్చు. రాజకీయాల్లో ఇలాంటి ఘటనలు చాలా చూశాం. ఇప్పుడు ఇదే ఫార్ములా కాంగ్రెస్ లో ఒకింత ఆశను రేపుతుంది. మొన్నటి వరకు కాంగ్రెస్ పై తీవ్ర ఆగ్రహంగా ఉన్న ఏపీ ప్రజలు ఇప్పుడిప్పుడే కొంత ఆలోచనలో పడ్డట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ కు తిరిగి ఏపీలో బలపడడానికి అవకాశం వస్తుందని నేతలు ఊహించుకుంటున్నారు. గత పదేళ్లలో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ బాగా బలహీనపడడంతో కాంగ్రెస్ పెద్దలు ఏపీపై అస్సలు దృష్టి పెట్టలేదు. కానీ మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి ఎన్డీయో కూటమికి తీవ్ర పోటీనీ ఇచ్చింది. ఒక సందర్భంలో ఇండియా కూటమి అధికారం చేజిక్కించుకుంటుందా అన్న అనుమానాలు కూడా కలిగాయి. కానీ స్వల్ప మెజార్టీతో నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని అయ్యారు.కాంగ్రెస్ అనూహ్య స్థాయిలో పుంజుకోవడంతో కాంగ్రెస్ శ్రేణులల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. జనాల్లో కాంగ్రెస్ కు మంచి ఆదరణ ఉందని గమనించి హై కమాండ్ పెద్దలు అన్ని రాష్ట్రాల్లో దృష్టి పెట్టాలని కాంగ్రెస్ ను మరింత బలపర్చడానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై లోతుగా చర్చించింది.
అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ మీద కాంగ్రెస్ హై కమాండ్ ప్రత్యేక దృష్టి పెట్టిందని ఏపీ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. దానిలో భాగంగానే వైఎస్ షర్మిలను పిసిసి చీప్ గా నియమించడం ఆ వ్యూహంలో భాగమేనని చెబుతున్నారు. ఏపీలో ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే లెక్కలు సరిచేసి మళ్లీ పట్టు సాధించాలని కాంగ్రెస్ హై కమాండ్ భావిస్తుందట. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ఎంతో బలంగా ఉండేది. వైఎస్ మరణాంతరం పార్టీ పరిస్థితి గందరగోళంగా మారింది. అప్పటి వరకు కాంగ్రెస్ ఎంతో పటిష్టంగా కనిపించింది. కానీ ఆయన మరణాంతరం జరిగిన పరిణామాలతో ఆ పార్టీలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఒక వైపు తెలంగాణ విభజన అంశం, మరోవైపు వైఎస్ తనయుడు జగన్ మోహన్ రెడ్డి అంశం కాంగ్రెస్ కు పెద్ద తలనొప్పిగా మారాయి. ఈ రెండింటికి చెక్ పెట్టాలంటే రాష్ట్ర విభజనే పరిష్కారం అనుకుంది .అనుకున్నదే తడువుగా తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలోని అప్పటి యూపీఏ సర్కార్ నిర్ణయం తీసుకుంది. విభజనతో ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా కాంగ్రెస్ భావించింది. జగన్ మోహన్ రెడ్డి ఇష్యూకు విభజనతో పుటిస్టాప్ పెట్టవచ్చు అనుకుంది. కానీ అక్కడే కాంగ్రెస్ వ్యూహం దెబ్బతింది. విభజనతో తెలంగాణలో అధికారంలోకి రావొచ్చు, ఏపీలో జగన్ ను దెబ్బకొట్టొచ్చు అనుకుంది. కానీ విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ ఓటమి చెందగా, ఏపీలో కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది. ఒక్కటంటే ఒక్కసీటు దక్కించుకోలేకపోయింది. దీంతో కాంగ్రెస్ ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా దెబ్బతింది.
విభజన జరిగిన పదేళ్ల తరువాత తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పడు ఇదే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లో కూడా కొత్త ఆశలు చిగురించేలా చేసింది. అయితే దానికి తోడు కాంగ్రెస్ పెద్దలు కొత్త వ్యూహంతో ఏపీలో రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వైస్సార్పీపీ కాంగ్రెస్ రెప్లికా అనవచ్చు. వైసీపీలో ఉన్న లీడర్లు, క్యాడర్ అంతా కూడా కాంగ్రెస్ కు చెందిన వారే. దానికి తోడు 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించింది. దీంతో కాంగ్రెస్ కు ఏపీలో ఏమాత్రం అవకాశం లేకుండా పోయింది. ఇదే క్రమంలో వైఎస్ జగన్ కు ఆమె సోదరి షర్మిలకు మధ్య విభేధాలు రావడంతో రాజకీయంగా షర్మిల వేరు కుంపటి పెట్టుకుంది. అ తర్వాత తన పార్టీనీ కాంగ్రెస్ లో కలిపేసింది. అసెంబ్లీ ఎన్నికల వరకు తెలంగాణలో షర్మిల హడావుడి చేసింది. అయితే ఏపీలో ఎన్నికల తరుణంలో కాంగ్రెస్ హైకమాండ్ వ్యూహం మార్చింది. అప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్ ఏపీలో కూడా బలపడాలని ప్లాన్ వేసింది. దానిలో భాగంగా షర్మిలను ఏకంగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా నియమించింది. దీంతో అసలు కథ మొదలయ్యింది. ఎన్నికల్లో కాంగ్రెస్ రాణించకున్నా అదే సమయంలో మాత్రం కాంగ్రెస్ కు అనుకూలించే పరిణామం సంభవించింది. వైసీపీ ఘోర ఓటమి చెందింది. ఇప్పుడు దీనినే కాంగ్రెస్ హైకమాండ్ అడ్వంటేజ్ గా తీసుకోవాలనుకుంటుంది.
దివంగత నేత వైస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు జగన్ వల్ల పార్టీ దెబ్బతింది. ఇప్పుడు అదే వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయురాలితో తిరిగి కాంగ్రెస్ ను బలోపేతం చేయాలని కాంగ్రెస్ వ్యూహాలు పన్నుతుంది.. ఇప్పటికే వైసీపీ ఓటమితో చాలా మంది నేతలు సైలెంట్ అయ్యారు. వైసీపీలో ఉన్నవారిలో మెజార్టీ రాజశేఖర్ రెడ్డి అభిమానించే వాళ్లే. వాళ్లు అంతా కూడా కాంగ్రెస్ వాళ్లే. ఇప్పుడు వాళ్లనే కాంగ్రెస్ హై కమాండ్ టార్గెట్ చేసింది. షర్మిలతో ఏపీలో కాంగ్రెస్ కు పునర్వైభవాన్ని తీసుకురావాలని అనుకుంటుంది. దీనికి ఇదే మంచి తరుణంగా కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తుంది. వైసీపీ లోని ముఖ్య నేతలకు గాలం వేసి తిరిగి కాంగ్రెస్ లో చేర్చుకొని పార్టీనీ బలోపేతం చేయాలనుకుంటుందట. అందుకే ఏపీలో షర్మిలకు పూర్తి స్థాయిలో ప్రీడం ఇచ్చిందట. ఇదే క్రమంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా వచ్చే ఎన్నికల్లో షర్మిల సీఎం అవడం ఖాయం అనడం కూడా రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చ జరగుతుంది. అంటే ఇక నుంచి వైసీపీ టార్గెట్ గా కాంగ్రెస్ పావులు కదుపుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మొత్తానికి ఏపీలో కాంగ్రెస్ తిరిగి బలోపేతం అవ్వాలని కలల కంటోంది. జగన్ తో పోయిన పార్టీ శ్రేణులను తిరిగి షర్మిలతో రప్పించాలని అనుకుంటుంది. నిజంగానే కాంగ్రెస్ హై కమాండ్ అనుకుంటున్నట్లుగా ఏపీలో షర్మిల గేమ్ చేంజర్ గా మారుతుందా లేదా వేచి చూడాలి.
ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!
ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook