హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె కాలంలో బస్సులు నడిపి ప్రజా రవాణా సౌకర్యానికి సహకరించిన తమకు ఆర్టీసీలో ఉద్యోగాలు కల్పించాలని తాత్కాలిక సిబ్బంది ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం హైదరాబాద్లోని పలు డిపోల వద్దకు చేరుకున్న తాత్కాలిక సిబ్బంది.. 55 రోజుల పాటు ఆర్టీసీ బస్సులు నడిపిన తమకు ఆర్టీసీ ఉద్యోగాల్లో శాశ్వతంగా అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తాత్కాలిక సిబ్బంది మాట్లాడుతూ.. ఆర్టీసీ సమ్మె తర్వాత ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తాత్కాలిక సిబ్బందికి కూడా ఆర్టీసీలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారని వారు గుర్తుచేశారు. ఆదివారం ఆర్టీసీ కార్మికులతో జరిపిన సమావేశంలో ఆ విషయాన్ని మరిచారని అన్నారు.
ఆర్టీసీ సమ్మె సమయంలో ప్రభుత్వం పిలుపుమేరకు తాము ప్రైవేటు ఉద్యోగాలు వదులుకొని మరీ 55 రోజుల పాటు ఆర్టీసీ బస్సులు నడిపించామని అన్నారు. ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు తిరిగి ఉద్యోగాల్లో చేరడంతో తాము రోడ్డున పడ్డామని, ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు ఆర్టీసీలో అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తిచేశారు.