Revanth Reddy Speech From Bodhan Meeting: మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘాటు కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ ని ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, " ఆ రోజు మేము తెలంగాణ ఇయ్యకుంటే ఈ రోజు మీరు బిచ్చమెత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చి ఉండేది " అని అన్నారు. " కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాబట్టే.. ఇవాళ మీ అయ్య సీఎం, నువ్వు, నీ బావ మంత్రులు, మీ చెల్లె ఎమ్మెల్సీ అయ్యారని ఎద్దేవా చేశారు. ఈ రోజు మీరు అనుభవిస్తున్న ఈ వైభవానికి కాంగ్రెస్ పార్టీనే కారణం " అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. యాత్ర ఫర్ చేంజ్ లో భాగంగా 30వ రోజైన గురువారం బోధన్ నియోజకవర్గం పరిధిలోని ఎడపల్లి మండల కేంద్రం నుంచి బోధన్ వరకు పాదయాత్ర చేపట్టారు. పాదయాత్ర అనంతరం బోధన్ అంబేద్కర్ చౌరస్తా వద్ద నిర్వహించిన జన సభలో పాల్గొని మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
గత నెల 6వ తేదీన మేడారం సమ్మక్క - సారాలమ్మ అశీర్వాదంతో మొదలుపెట్టిన యాత్ర ఫర్ చేంజ్ యాత్ర మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాలను కవర్ చేస్తూ గురువారం నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని బోధన్ అసెంబ్లీ నియోజకవర్గానికి యాత్ర చేరుకుంది. బోధన్ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లపై రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కేసీఆర్, దేశంలో మోదీ కులాలు, మతం పేరుతో ప్రజలను విభజించి పాలించాలని చూస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో దేశ ప్రజల్లో విశ్వాసం కలిగించడం కోసం నఫ్రత్ చోడో భారత్ జోడో అనే సందేశంతో రాహుల్ గాంధీ దేశమంతా పాదయాత్ర చేశారు అని అన్నారు.
నిజామాబాద్ అంటే నిజాం సాగర్ గుర్తుకొస్తుంది. బోధన్ అంటే నిజాం షుగర్ ఫ్యాక్టరీ గుర్తుకొస్తుంది. నిజామాబాద్ అంటే పెద్దలు ఎం.నారాయణ రెడ్డి, అర్గుల రాజారాం, బాలగౌడ్, షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి వంటి వారు గుర్తుకొస్తారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిజామాబాద్ జిల్లాకు 3 లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వడం కోసం ప్రాణహిత చెవేళ్ల ప్రాజెక్టును మంజూరు చేశారు. కానీ నేడు కేసీఆర్ ఆ ప్రాజెక్టును పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నాడు. మేము అధికారంలోకి రాగానే ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తాం. నిజామాబాద్ జిల్లాలో బాజిరెడ్డి, షకీల్, జీవన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి వంటి భూ కబ్జాదారులు, ఇసుక దొంగలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇటువంటి సన్నాసులతో నేను పోటీ చేయలేను అని సుదర్శన్ రెడ్డి అన్నారు. అప్పుడు సోనియా గాంధీ తెలంగాణ అభివృద్ధి చెందాలంటే మీ లాంటి వారు రాజకీయాల్లో ఉండాలని కోరారు. అందువల్లే సుదర్శన్ రెడ్డి రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఆయన లాంటి వారి సేవలు పార్టీ అవసరం. కాబట్టి పార్టీ కోశాధికారిగా సుదర్శన్ రెడ్డిని నియమించారు అని గుర్తుచేసుకున్నారు.
బోధన్ ఎమ్మెల్యే షకీల్ బుద్ధిమంతుడు అని కనీసం టీఆర్ఎస్ నాయకులైనా చెప్పగలరా ? అని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి.. మైనార్టీల కోసం షకీల్ ఎప్పుడైనా అసెంబ్లీలో మాట్లాడారా అనే విషయం మైనార్టీ సోదరులే ఆలోచించుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు షబ్బీర్ అలీ గారు మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు ఇప్పించారు. కేసీఆర్ మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తా అని మోసం చేస్తుండు. దీని మీద మీ ఎమ్మెల్యే షకీల్ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. షకీల్ ఇసుక దొంగ, బియ్యం దొంగ, భూకబ్జాదారుడు. తన దొంగతనాలు బయటపడతాయి కాబట్టి.. కేసీఆర్‌ను ఏమీ ప్రశ్నించడం లేదని ఆరోపించారు.
నిన్న జుక్కల్‌లో మీటింగ్ పెట్టి డ్రామారావు 10 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ ఏమి చేసింది అని అడుగుతుండు. అరే సన్నాసి.. దేశంలో, రాష్ట్రంలో ప్రతీ ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ కట్టిందే. నాగార్జునసాగర్, నెట్టంపాడు, జూరాల.. ఈరోజు ఉన్న ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ పార్టీ కట్టినవే. రాష్ట్రంలో 30 వేల పాఠశాలలు, వెయ్యి జూనియర్ కాలేజీలు, 100 డిగ్రీ కాలేజీలు, 11 యూనివర్సిటీలు ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లో ఓఆర్ఆర్, ఎయిర్ పోర్ట్, ఐటీ, ఫార్మసీ కంపెనీలు, శిల్పారామం కట్టింది కాంగ్రెస్ పార్టీనే. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చి పెట్టింది కాంగ్రెస్ పార్టీనే, తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. ఆ రోజు మేము తెలంగాణ ఇయ్యకుంటే ఈ రోజు మీరు బిచ్చమెత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది కాబట్టే..మీ అయ్యా సీఎం, నువ్వు, నీ బావా మంత్రులు, మీ చెల్లె ఎమ్మెల్సీ అయింది. ఈ రోజు మీరు అనుభవిస్తున్న వైభవానికి కారణం కాంగ్రెస్ పార్టీనే అంటూ మంత్రి కేటీఆర్‌కి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
ఇది కూడా చదవండి : Swapnalok Complex Fire Accident: స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్ని ప్రమాదం ఘటనలో ఐదుగురు మృతి
ఇది కూడా చదవండి : Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో హైడ్రామా.. ఎమ్మెల్సీ కవితకు ఈడీ మళ్లీ నోటీసులు
ఇది కూడా చదవండి : TSPSC Paper Leak: పేపర్ లీకేజీ బాధ్యుడు కేటీఆరే.. బర్తరఫ్ చేసి లోపలేసి తొక్కే దమ్ముందా..? బండి సంజయ్ సవాల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK