Telangana Election Results 2023: కర్ణుడి చావుకు కారణాలు అనేకమో కాదో గానీ తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమికి మాత్రం అన్నీ కారణాలే. అవినీతి, అతి విశ్వాసం, నిర్లక్ష్యం, నిరంకుశత్వం ఇలా ఒకదానివెంట మరొక కారణాలున్నాయి. హ్యాట్రిక్ సీఎం కావాలనే కేసీఆర్ ఆశలు అడియాశలు కావడమే కాకుండా పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో ఒక చోట ఓడిపోయారు. బీఆర్ఎస్ ఈ పరిస్థితికి కారణమేంటి
తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి కారణాలను విశ్లేషించుకుంటే ప్రధాన కారణం సిట్టింగు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత. రెండూ మూడో మార్పులు తప్ప వరుసగా పదేళ్ల నుంచి దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యే అభ్యర్ధులు మారలేదు. వ్యతిరేకత ఉన్నా పట్టించుకోకుండా మరోసారి సిట్టింగులకే టికెట్ ఇవ్వడం కేసీఆర్ కొంపముంచింది. బీఆర్ఎస్ నేతల అహంకారం ప్రజల్లో ఆగ్రహానికి కారణమైంది.
వరుసగా పదేళ్లు అధికారంలో ఉండటంతో సహజంగా ఏర్పడే ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు ఎమ్మెల్యేలు, మంత్రుల్లో పేరుకుపోయిన అవినీతితో ప్రజలు విసిగిపోయారు. ప్రభుత్వ వైఖరితో విసిగకి మార్పు కోరుకున్నారు. కొత్తవారికి అవకాశమిద్దానుకునే తరుణంలో అక్కడ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మాత్రమే కన్పించింది. మంత్రుల్లో అవినీతి ఉన్నా ప్రభుత్వ పెద్దలు పట్టించుకోకపోవడంతో ఏకంగా 7-8 మంది మంత్రులు ఓటమిపాలయ్యారు.
మరోసారి గెలిపిస్తారనే అతి విశ్వాసం కొంపముంచింది. ప్రభుత్వంపై కొద్దిగా సానుకూలత ఉన్నా సరే..ఎమ్మెల్యేలు, మంత్రులపై వ్యతిరేకతను కేసీఆర్ పట్టించుకోలేదు. సిట్టింగుల్ని కాదని కొత్తవారికి టికెట్ ఇచ్చి ఉంటే పరిస్థితి మరోలో ఉండేది. అభ్యర్ధుల్ని మారిస్తే పార్టీలో సమస్యలు తలెత్తుతాయని భయపడిన కేసీఆర్ మొత్తానికే నష్టపోయారు.
సంక్షేమ పథకాలు గట్టెక్కిస్తాయనుకున్నా అవే కొంపముంచాయి. దళిత బంధు, డబుల్ బెడ్ రూమ్స్, పెన్షన్లు వంటివాటిల్లో లబ్దిదారుల ఎంపికలో చాలా అన్యాయం జరిగింది. సంక్షేమ పథకాలు చివరి వరకూ అంటే అందరికీ చేరలేదనే వాస్తవాన్ని గ్రహించలేకపోయింది కేసీఆర్ ప్రభుత్వం. అదే సమయంలో కాంగ్రెస్ విడుదల చేసిన హామీలు ప్రజల్ని ఆకట్టుకున్నాయి.
బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే భావన ప్రజల్లో కలగడం మరో కారణం. రెండు పార్టీల మధ్య స్నేహం పెరగడంతో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం స్థానాన్ని ఆక్రమించింది. కర్ణాటక ఎన్నికల్లో విజయంతో కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చింది. కుటుంబ పార్టీ పాలన అనే అంశం కూడా ఓ కారణం కావచ్చు.
Also read: Telangana Election Results 2023: తెలంగాణ ఎన్నికల్లో బోర్లాపడిన జనసేన, డిపాజిట్ కోల్పోయిన అభ్యర్ధులు
నికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook