Palle pragathi 2nd phase dates : జనవరి 2 నుండి 12 వరకు తెలంగాణలో 2వ విడత పల్లె ప్రగతి

తెలంగాణలోని అన్ని గ్రామాల్లో నిర్వహించనున్న 2వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం బి.ఆర్.కె.ఆర్ భవన్‌లో 2వ విడత పల్లె ప్రగతి నిర్వహణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. ఎస్.కె.జోషితో కలిసి ప్రభుత్వం నియమించిన ఫ్లయింగ్ స్క్వాడ్స్ అధికారుల బృందంతో కలిసి సమావేశం నిర్వహించిన అనంతరం, జిల్లా కలెక్టర్లతో మంత్రి ఎర్రబెల్లి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

Last Updated : Dec 27, 2019, 08:40 PM IST
Palle pragathi 2nd phase dates : జనవరి 2 నుండి 12 వరకు తెలంగాణలో 2వ విడత పల్లె ప్రగతి

హైదరాబాద్: జనవరి 2 నుండి 12 వరకు తెలంగాణలోని అన్ని గ్రామాల్లో నిర్వహించనున్న 2వ విడత పల్లె ప్రగతి (Palle pragathi) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) విజ్ఞప్తి చేశారు. శుక్రవారం బి.ఆర్.కె.ఆర్ భవన్‌లో 2వ విడత పల్లె ప్రగతి నిర్వహణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. ఎస్.కె.జోషితో కలిసి ప్రభుత్వం నియమించిన ఫ్లయింగ్ స్క్వాడ్స్ అధికారుల బృందంతో కలిసి సమావేశం నిర్వహించిన అనంతరం, జిల్లా కలెక్టర్లతో మంత్రి ఎర్రబెల్లి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పల్లె ప్రగతి నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని అన్నారు. పల్లెప్రగతి కార్యక్రమం నిర్వహణతో దేశవ్యాప్తంగా రాష్ట్రానికి మంచి గుర్తింపు వచ్చిందని, 2వ విడత నిర్వహణకు సంబంధించి జిల్లా స్ధాయి సమావేశాల నిర్వహణను వెంటనే పూర్తిచేయాలని కలెక్టర్లను ఆదేశించారు. గ్రామ పంచాయతీల కోసం ప్రతి నెల 339 కోట్లను విడుదల చేశామన్నారు. గ్రామాలలోని యువకులను, మహిళలను, పెన్షనర్లను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు అయ్యేలా చూడాలన్నారు. గ్రామాల వారిగా చేపట్టిన, చేపట్టపోయే పనులు, కార్యక్రమాల వివరాలను తెలియజేసేలా ఓ బుక్ లెట్ అందించాలన్నారు. పాఠశాలల అభివృద్ధికి దాతలు ముందుకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతీ గ్రామ పంచాయతీలో ట్రాక్టర్‌ల కొనుగోలుకు చర్యలు సత్వరం పూర్తి చేయాలన్నారు. తమ గ్రామాలను తామే పరిశుభ్రంగా ఉంచుకునే స్పూర్తి కలిగేలా ప్రజలను చైతన్యవంతం చేయాలని అధికారులకు సూచించారు. 

గ్రామాల్లో నర్సరీల పెంపకం, వైకుంఠదామాలు, డంపింగ్ యార్డులకు స్ధలసేకరణ, నాటిన మొక్కల సంరక్షణ, శిధిల గృహాల తొలగింపు, పాతబావుల పూడ్చివేత, డస్ట్ బిన్ల సరఫరా, ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం లాంటి అంశాలపై దృష్టి సారించాలని మంత్రి ఎర్రబెల్లి అధికారులకు స్పష్టంచేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్స్ అధికారులు జనవరి 2 న నిర్వహించే గ్రామ సభలలో పాల్గొనాలన్నారు. గ్రామాలలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు సరియైన రీతిలో పల్లె ప్రగతిని నిర్వహించేలా చూసే బాధ్యత ఫ్లయింగ్ స్క్వాడ్‌దేనని అన్నారు. విధులలో నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు మంచిగా పనిచేసే వారిని ప్రోత్సహించాలన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పిన మంత్రి.. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పరిశుభ్రతలో మెదక్ జిల్లా మల్కాపూర్ గ్రామాన్ని స్పూర్తిగా తీసుకొని గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Trending News