Harish Rao on Congress Govt: ఎన్నికల ఫలితాలు వచ్చి నేటికి 45 రోజులవుతోందని.. ఓటమి నుంచి తేరుకుని నెల రోజులకే సమీక్ష, సన్నాహక సమావేశాలు ప్రారంభించామని మాజీ మంత్రి టి.హరీష్ రావు అన్నారు. నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమీక్ష నిర్వహించారు. కార్యకర్తలు ఏది కోరుకుంటున్నారో రాబోయే రోజుల్లో అదే జరుగుతుందని.. పార్టీ వారి అభిప్రాయం మేరకే పని చేస్తుందన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం రేయింబవళ్లు తండ్లాడాం.. అయినా అసెంబ్లీ ఎన్నికల్లో తడబడ్డామన్నారు. మన పార్టీ స్థానం మారిందని, పాలన నుంచి ప్రతిపక్షానికి వచ్చామని.. అయినా అధైర్య పడాల్సిన అవసరం లేదని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.
"ఉద్యమానికి ఊపిరి లూదిన వాళ్లం.. పేగులు తేగే దాకా మన మాతృ భూమి కోసం కొట్లాడిన వాళ్లం.. మనకు సత్తువ ఉంది.. సత్తా ఉంది ప్రతిపక్షంలో కూడా మన మట్టి మనుషుల ఆకాంక్షల కోసం ఊపిరి ఉన్నంత వరకు పోరాడుదాం.. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారడానికి బలమైన కారణాలు ఉండనక్కర్లేదు. ఈ సోషల్ మీడియా దుష్ప్రచారాల కాలంలో ప్రభుత్వం మారడానికి ప్రజలకు పనికొచ్చే అంశాలు కూడా ఉండనక్కర్లేదు. రాజస్థాన్‌లో ఐదేళ్లకే ప్రభుత్వం మారింది.. ఛత్తీస్ ఘడ్లో కూడా ఐదేళ్లకే మారింది.. ఇట్లా ప్రభుత్వాలు మారడం దేశంలో కొత్తేమి కాదు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల్లో వరుసగా పదేళ్లు పాలించిన సందర్భాలు చాలా అరుదు.
ఐదేళ్లలోపే ప్రజావ్యతిరేకతను మూట గట్టుకుని ఇంటికి పోయిన కాంగ్రెస్ ప్రభుత్వాలే ఈ దేశంలో ఎక్కువ. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే ఏడాదికి మూడున్నర లక్షల కోట్ల రూపాయలు కావాలి. మన బడ్జెట్ ఎంత..? 2 లక్షల 90 వేల కోట్లు. బడ్జెట్ కన్నా మించి హామీలిచ్చారు. ఎలాగూ అధికారం రాదు కదా అని అరచేతిలో వైకుంఠం చూపేలా మేనిఫెస్టోను రాసేశారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చింది. ఎన్నికలపుడు ఇష్టమొచ్చిన విధంగా ప్రజలను మభ్యపెట్టి ఇపుడు వాటి గురించి మనం అడిగితే కాకమ్మ కథలు చెబుతున్నారు. హామీల సంగతి చూడమంటే అవసరం లేని విషయాలు తెరపైకి తెస్తున్నారు.
కర్ణాటకలో 5 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. 5 గ్యారంటీల అమలుకు డబ్బులు లేవని కర్ణాటక ఆర్థిక సలహాదారు బసవరాజ్ రాయరెడ్డి మొన్న మీడియాతో చెప్పారు. గ్యారంటీలు అమలు చేస్తే కర్ణాటక ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని ఆయన హెచ్చరించారు. మన దగ్గర కూడా కాంగ్రెస్ నేతలు గ్యారంటీల చావు వార్త చెప్పే రోజులు ఎంతో దూరంలో లేవు. రాజకీయాలకతీతంగా కేసీఆర్ తెలంగాణను అభివృద్ధి చేశారు. ఇది ఎవరూ కాదనలేని సత్యం. సాంప్రదాయ రాజకీయ పద్ధతులకు కేసీఆర్ దూరంగా ఉన్నారు. కొంత అది నష్టం చేసిందన్న భావన కార్యకర్తల్లో ఉంది.
పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తేనే తెలంగాణ సమస్యలకి పరిష్కారం. విభజన సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. ఈ కీలక సమయంలో బీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీలో లేకపోతే తెలంగాణకు నష్టం. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఓ గుణపాఠంగా నేర్చుకుని ముందుకు సాగుదాం.. పార్లమెంటులో సత్తా చాటుదాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్రం చేతులెత్తేసింది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో 111వ హామీ కింద పాలమూరుకు జాతీయ హోదా తెస్తామని చెప్పింది. ఇంకా వంద రోజులు కాలేదు కదా అని ఆగుతున్నాం.. లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడే వాళ్లం.. కొన్ని రోజులైతే బీఆర్ఎస్ నేతలు ఇంట్లో కూర్చున్నా.. రండి రండి అని ప్రజలే బయటకు తీసుకువస్తారు.." అని హరీశ్ రావు అన్నారు.
Also Read: Chandrababu Case: క్వాష్ కొట్టివేత, ద్విసభ్య ధర్మాసనంలో ఎవరేమన్నారంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter