నారాయణ్‌పేట్: జిల్లాలోని మక్తల్ మండలం జక్లేర్ గ్రామంలో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇన్నోవా వాహనాన్ని ఓ బైక్ ఢీకొట్టిన ఘటనలో ఒక వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని దిశ కేసులో నిందితుడైన చెన్నకేశవులు తండ్రి లింగప్ప అలియాస్ కుర్మయ్యగా గుర్తించారు. కుర్మయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో తొలుత ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించినట్టు తెలుస్తోంది. దిశ కేసులో ఏ1 నిందితుడిగా ఉండి ఎన్కౌంటర్లో మృతిచెందిన ఆరిఫ్ స్వగ్రామమైన జక్లేర్‌కి వెళ్లి తిరిగి తమ స్వగ్రామమైన గుడిగండ్లకు వస్తుండగా కుర్మయ్య ఈ ప్రమాదం బారిన పడినట్టు తెలుస్తోంది. దిశ కేసులో నిందితులుగా ఉండి ఎన్‌కౌంటర్‌కు గురైన జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు గుడిగుండ్ల గ్రామానికి చెందిన వారేనని సంగతి తెలిసందే.
కుర్మయ్య మద్యం మత్తులో బైక్ నడుపుతూ ఎదురుగా వస్తున్న ఇన్నోవా కారు AP 29P 0837ను ఢీ కొన్నట్టు సమాచారం అందుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.