Chinna Jeeyar Swamy on CM KCR: రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని చినజీయర్ ఆశ్రమంలో జరిగిన సమతామూర్తి విగ్రహావిష్కరణకు సీఎం కేసీఆర్ హాజరుకాకపోవడం పెద్ద చర్చకే దారితీసింది. విగ్రహావిష్కరణ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన కేసీఆర్.. తీరా విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరుకాకపోవడం అందరినీ విస్మయానికి గురిచేసింది. చినజీయర్ తీరుపై ఆగ్రహంగా ఉండటం వల్లే కేసీఆర్ ఆ కార్యక్రమానికి హాజరుకాలేదనే ప్రచారం జరిగింది. తాజాగా త్రిదండి చినజీయర్ స్వామి ఈ ప్రచారంపై స్పందించారు.
సీఎం కేసీఆర్‌తో తమకు విభేదాలు లేవని చినజీయర్ స్వామి స్పష్టం చేశారు. స్వపక్షం, ప్రతిపక్షం రాజకీయాల్లోనే ఉంటాయని.. తమకు అందరూ సమానమేనని చెప్పారు. అనారోగ్యం, పని ఒత్తిడి కారణంగానే ఆయన సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాలేకపోయి ఉండొచ్చునని అన్నారు. ఆయన సహకారం ఉన్నందునే కార్యక్రమం విజయవంతమైందన్నారు. శనివారం (ఫిబ్రవరి 18) ఆశ్రమంలో శాంతి కల్యాణం నిర్వహిస్తున్నామని.. సీఎం కేసీఆర్‌కు కూడా ఆహ్వానం పంపామని తెలిపారు. అయితే సీఎం వస్తారో రారో చూడాలన్నారు.
నిజానికి శ్రీ రామానుజచార్యుల సహస్రాబ్ది వేడుకల ముగింపు సందర్భంగా శాంతి కల్యాణం జరగాల్సి ఉంది. సీఎం కేసీఆర్ కోసమే ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారనే ప్రచారం జరిగింది. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కేసీఆర్ రాకపోవడంతో.. శాంతి కల్యాణానికి ఎలాగైనా రప్పించాలనే ఉద్దేశంతోనే కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు ప్రచారం సాగింది. ఒకవేళ రేపటి శాంతి కల్యాణానికి కూడా కేసీఆర్ హాజరవకపోతే చినజీయర్‌తో విభేదాలు ఉన్నాయనే ప్రచారానికి మరింత బలం చేకూరినట్లవుతుంది.
కాగా, సహస్రాబ్ది ఉత్సవాల కోసం ప్రభుత్వం తరుపున అన్ని విధాలా సహాయ సహకారాలు అందించగా.. సమతామూర్తి విగ్రహావిష్కరణ శిలాఫలకంపై తన పేరు లేకపోవడం కేసీఆర్‌కు ఆగ్రహం తెప్పించినట్లు చెబుతున్నారు. అందుకే కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి దూరంగా ఉన్నట్లు ప్రచారం జరిగింది. కేసీఆర్‌ను చల్లబరిచేందుకు స్వర్ణమూర్తి విగ్రహావిష్కరణ శిలాఫలకంపై ఆయన పేరు పెట్టినప్పటికీ.. ముగింపు ఉత్సవాలకు కూడా ఆయన దూరంగానే ఉన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook