AICC President Election: తెలంగాణ కాంగ్రెస్ నేతల తీరు మారడం లేదు. వర్గ పోరుతో రోడ్డున పడే కాంగ్రెస్ నేతలు.. చివరికి పార్టీ అధ్యక్ష ఎన్నికల సందర్భంగా గొడవ పడ్డారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ సాగుతోంది. గాంధీభవన్ లోనూ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య వర్గపోరు బయటపడింది. ఓటరు జాబితాలోని పేర్లు మార్చాలంటూ పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఆందోళనకు దిగారు. రాత్రికి రాత్రే పేరెలా మారుస్తారంటూ సిబ్బందిపై మండిపడ్డారు.
జనగామ నియోజకవర్గానికి సంబంధించి డెలిగేట్ ఓట్ల విషయంలో ఈ రగడ జరిగింది. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గం నుంచి ఇద్దరికి ఓటు వేసే అవకాశం కల్పించారు. జనగామ నియోజకవర్గం నుంచి పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల, చెంచారపు శ్రీనివాస్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. అయితే చివరి నిమిషంలో జాబితాలో మార్పు చేశారు. శ్రీనివాస్ రెడ్డి స్థానంలో మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పేరు చేర్చారు. ఈ విషయం తెలియని పొన్నాల లక్ష్మయ్య.. శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఓటు వేసేందుకు గాంధీభవన్ వచ్చారు. శ్రీనివాస్ రెడ్డి పేరు మార్చారని తెలియడంతో అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. పీసీసీ ఎన్నికల సిబ్బందిపై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు.
ఓటర్ జాబితాలో చివరి నిమిషంలో కొమ్మూరి పేరు చేర్చడంపై పొన్నాల లక్ష్మయ్య ఆగ్రహం వ్యక్తంచేశారు. జాబితాలో ముందుగా పేరున్న శ్రీనివాస్ రెడ్డికి ఓటు వేసే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. శ్రీనివాస్ రెడ్డికి బదులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి ఓటు ఇవ్వడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. 45ఏళ్ల కాంగ్రెస్ మనిషికి అవమానమని పొన్నాల మండిపడ్డారు. దీంతో.. పొన్నాలను కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి సముదాయించారు. పొన్నాలకు జానారెడ్డి సర్దిచెప్పారు. ఆ తర్వాత శ్రీనివాస్ రెడ్డితో పాటు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇద్దరినీ ఓటు వేయకుండా పీఆర్వో ఆపారు. పీసీసీ సభ్యుల నియామకంపై తనకు కూడా అనుమానాలు ఉన్నాయని.. తేడా ఎక్కడ జరిగిందో తెలుసుకుంటామని తెలిపారు.
137 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎన్నిక జరగడం ఇది ఆరోసారి. 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత గాంధీ కుటుంబేతర వ్యక్తి కాంగ్రెస్ పదవి చేపట్టనున్నారు.దేశ వ్యాప్తంగా 9 వేల మందికిపైగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అధ్యక్ష ఎన్నికల బరిలో పార్టీ సీనియర్ నేతలు మల్లిఖార్జున ఖర్గే, శశిథరూర్ ఉన్నారు. ఎల్లుండి ఓట్లు లెక్కింపు జరగనుంది. దేశంలోని అన్ని రాష్ట్రాల పీసీసీ కార్యాలయాల్లో, ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో పోలింగ్ జరుగుతోంది.
Read also: Munugode ByPoll: కోమటిరెడ్డి రాజీనామాతో జరిగిన మేలు ఇదే! మునుగోడులో ఫ్లెక్సీల కలకలం
Read also: Vishadam: చందానగర్ సూసైడ్ కేసులో కొత్త కోణం.. భార్యపై అనుమానంతో భర్తే హత్య చేశాడా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook