TTD Darshanam Latest News : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో శ్రీవారి భక్తులు తరలి వస్తుంటారనే సంగతి తెలిసిందే. వారాంతరాల్లో, సెలవు రోజుల్లో భక్తులు సంఖ్య మరింత అధికం అవుతుందనే సంగతి కూడా తెలిసిందే. దీంతో సెలవు దినాల్లో, ప్రత్యేక దినాల్లో స్వామివారి దర్శన భాగ్యం కోసం వేంకటేశ్వర స్వామి భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సి వస్తోంది. అయినప్పటికీ భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో, క్రమశిక్షణతో గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండి తమకు ఎంతో ఇష్టమైన, ఆరాధ్య దైవమైన తిరుమల వెంకన్నను దర్శించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
ఫిబ్రవరిలో స్వామివారిని ఎంతమంది భక్తులు దర్శించుకున్నారు, హుండీ ఆదాయం ఏ మేరకు వచ్చింది అనే వివరాలను టీటీడీ బోర్డు వెల్లడించింది. ఫిబ్రవరి నెలలో 18.42 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా.. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ. 114.29 కోట్ల ఆదాయం వచ్చింది. దాదాపు 92.96 లక్షల లడ్డులను భక్తులకు విక్రయించినట్టు టీటీడీ పేర్కొంది. అదే సమయంలో 7.21 లక్షల మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు. 34.06 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించినట్టు టీటీడీ బోర్డు వెల్లడించింది.
ఇదిలావుంటే, తిరుమలలో సాలకట్ల తెప్పోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీవారి పుష్కరిణిలో మొదటి రోజు సీతా సమేత శ్రీరామచంద్రమూర్తి, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి వార్లను తెప్పలపై ఊరేగించారు. పుష్కరిణిలో మూడు సార్లు విహరించి భక్తులకు దర్శనం ఇచ్చారు. పుష్కరిణిలో శ్రీవారి తెప్ప విద్యుత్ అలంకరణ ఆకట్టుకుంది. పుష్కరిణిలో గోవింద నామస్మరణతో మారుమోగింది. తెప్పోత్సవాల కారణంగా శుక్రవారం నుంచి మంగళవారం వరకు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, తోమాల సేవ, అర్చన సేవలను రద్దు చేసినట్టు టిటిడి ప్రకటించింది. ఆయా సేవల కోసమే తిరుమలకు వచ్చే భక్తులు ఈ విషయాన్ని గ్రహించాల్సిందిగా టీటీడీ బోర్డు భక్తులకు విజ్ఞప్తి చేసింది.