MIM Corporator Shocking Misbehaviour: పవిత్ర రంజాన్ మాసంలో ప్రశాంతంగా ఉండాల్సిన ఎంఐఎం ప్రజా ప్రతినిధి రెచ్చిపోయాడు. పోలీసులపైకే రంకెలేశాడు. ఖాకీల పట్ల చులకనగా వ్యాఖ్యలు చేశాడు. రంజాన్ నెలంతా తమ ఇలాకాలోకి రావొద్దంటూ హుకుం జారీచేశాడు. ఇప్పుడీ అంశం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎంఐఎం ప్రజాప్రతినిధుల తీరుపై చర్చను లేవనెత్తుతోంది. హైదరాబాద్ పాతబస్తీతో పాటు.. ఓ సామాజికవర్గం వాళ్లు ఎక్కువగా నివసించే కొన్ని ప్రాంతాల్లో తరచూ చోటు చేసుకుంటున్న సంఘటనలు వివాదాస్పదం అవుతున్నాయి. పోలీసులకు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. వాళ్ల నివాస ప్రాంతాల్లో, ఎంఐఎం నేతలు ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాంతాల్లో రాజ్యాంగం వర్తించదా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాళ్లు చట్టానికి అతీతులా? అన్న ప్రశ్నలు వస్తున్నాయి.
ఎంఐఎం ప్రజాప్రతినిధులు చాలాసార్లు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పోలీసుల పట్ల వాళ్లు ప్రవర్తించే తీరు చర్చకు దారి తీస్తోంది. కొన్ని ప్రాంతాల్లో అసలు పోలీసులకు ఎంట్రీ కూడా నిషేధం అన్న స్థాయిలో సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇక, హైదరాబాద్ పాతబస్తీలో ఎంఐఎం నేతలు ఏది చెబితే అదే వేదమన్న వాదనలు కూడా ఎప్పటినుంచో ఉన్నాయి. మరి.. ఇలా బాహాటంగా ఎంఐఎం నేతలు బెదిరింపులకు పాల్పడటం వెనుక ధైర్యం ఏంటన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. పోలీసులే భయపడటం దేనికి సంకేతమన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
రెండు రోజుల క్రితం భోలక్‌పూర్‌లో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. కానీ, పోలీసు అధికారులు మాత్రం పట్టించుకోలేదు. మరుసటిరోజు కేటీఆర్ ట్వీట్ చేస్తే గానీ కేసు నమోదు చేసి.. నిందితుడిని అరెస్ట్ చేయని దుస్థితి నెలకొంది. ఇలాంటి పరిణామాలతో హైదరాబాద్‌లో ఓ వర్గం వాళ్ల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాళ్ల ఆగడాలు శృతి మించుతున్నాయన్న ఆరోపణలు నెలకొన్నాయి. ఎంఐఎం ప్రజా ప్రతినిధులు, నాయకుల దౌర్జన్యాలపై సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిని పరిశీలిస్తే.. పోలీసులు, చట్టాలు, రాజ్యాంగాన్ని లెక్కచేయని వైనం అర్థమవుతుంది. వీటికి సంబంధించిన ఆధారాలున్నా.. చర్యలు మాత్రం శూన్యమవుతున్నాయి.
భోలక్‌పూర్‌లో పోలీసులపై ఎంఐఎం కార్పొరేటర్ ఓ రకంగా దౌర్జన్యానికి దిగాడు. రంజాన్ మాసంలో అటువైపు రావొద్దంటూ హుకుం జారీచేశాడు. పోలీసులంటే వంద రూపాయల గాళ్లంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఈ పరిణామం వివాదాస్పదమయ్యింది. కానీ, నేరుగా పోలీసులనే తిట్టినా అధికారులు మాత్రం మంత్రి కేటీఆర్ (Minister KTR) ట్వీట్ చేసే వరకు తేలిగ్గా తీసుకున్నారు. అయితే, ఈ బెదిరింపులకు సంబంధించిన వీడియో మరుసటిరోజు బయటకు వచ్చింది. దీంతో, హైదరాబాద్‌లో ఎంఐఎం నేతల తీరుపై మరోసారి చర్చ మొదలయ్యింది. చట్టం వాళ్లకు చుట్టమా? అన్న సందేహాలు చుట్టుముడుతున్నాయి.
Also read : Bholakpur Corporator: ఎంఐఎం కార్పొరేటర్ వ్యవహారంపై స్పందించిన కేటీఆర్.. చర్యలు తీసుకోవాలని డీజీపీకి ట్వీట్!
Also read : MIM Corporator Threatens Police: మరీ ఇంత అరాచకమా.. పోలీసులకే పబ్లిగ్గా ధమ్కీ ఇచ్చిన ఎంఐఎం కార్పొరేటర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook