తమిళనాడులో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మధుర మీనాక్షి గుడిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాజగోపురం దగ్గర్లోని వేయీళ్ల మండపంలో శుక్రవారం రాత్రి మంటలు చెలరేగడంతో అక్కడున్న పలువురు సిబ్బంది భయంతో బయటకు పరుగులుతీశారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినా.. 50 పైగా దుకాణాలు దగ్ధమైనందున ఆస్తినష్టం చాలా ఎక్కువగా సంభవించే అవకాశముందని అధికారులు అంటున్నారు.
ఈ ప్రమాదం గురించి తెలియగానే కలెక్టర్ వీరరాఘవరావు హుటాహుటిన సంఘటన స్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. మంటలు చెలరేగి బాగా వ్యాప్తి చెందడంతో.. అగ్నిమాపక సిబ్బందికి సైతం వాటిని కంట్రోల్ చేయడం తలకు మించిన పనైంది. అయినా కొన్ని గంటల పాటు కష్టపడి పరిస్థితిని ఒక కొలిక్కి తీసుకురావడానికి ప్రయత్నించారు.
ప్రమాదానికి గల కారణాలు ఏమిటో పూర్తిస్థాయిలో తెలియనప్పటికీ.. కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగి ఉంటాయని అభిప్రాయపడుతున్నారు. అయితే ఇదే ప్రమాద ఘటనలో గుడిలో నివసిస్తున్న ఎన్నో పావురాలు చనిపోయాయి. ప్రమాదం జరిగినప్పుడు మంటలు కంట్రోల్ చేయడానికి ఫోమ్ లేదా ఏ ఇతర సామగ్రి కూడా అందుబాటులో లేకపోవడం వల్ల కూడా వాటి వ్యాప్తిని ఆపడానికి ఆస్కారం లేకపోయిందని కూడా కొందరు సిబ్బంది అంటున్నారు. పైగా ఆ ఆలయంలో భద్రతకు సంబంధించి ఎలాంటి ఆధునిక పరికరాలు లేకపోవడం కూడా శోచనీయమని పలువురు అంటున్నారు.