కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. శతాబ్ధంకుపైగా సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ రేపే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న తరుణంలో అంతకన్నా ఒక రోజు ముందే ఆమె తన రిటైర్ మెంట్ ప్రకటించారు. శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ తాను ఇక రాజకీయాల నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నట్టు తెలిపారు.
1991లో తన భర్త, దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య అనంతరం రాజకీయాల్లోకి రావడానికి విముఖత వ్యక్తంచేసిన సోనియా గాంధీ, 1996లో అప్పటి పార్టీ అధ్యక్షుడు సీతారామ్ కేస్రీపై పార్టీలో తీవ్ర అసహనం వ్యక్తమైన నేపథ్యంలో ఆ తర్వాతి ఏడాదే పార్టీలో ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు. 1997లో కలకత్తాలో జరిగిన పార్టీ ప్లీనరి సమావేశంలో పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న సోనియా గాంధీ 1998లో పార్టీ పగ్గాలు చేపట్టే బాధ్యత తీసుకున్నారు. అలా 1998 నుంచి కాంగ్రెస్ పార్టీ అధినేత్రిగా కొనసాగుతున్న సోనియా గాంధీ.. తన 20 ఏళ్ల రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పెడుతూ రిటైర్ మెంట్ ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
సోనియా గాంధీ రాజకీయాలకు స్వస్తి పలికినప్పటికీ.. కొత్తగా పార్టీ బాధ్యతలు చేపట్టిన రాహుల్ గాంధీకి అధికారికంగా కానీ లేదా అనధికారికంగా కానీ సలహాదారుగా వ్యవహరిస్తారనే అభిప్రాయాలు మాత్రం వినిపిస్తున్నాయి.