న్యూఢిల్లీ: ఈవీఎంలు రిమోట్ పరిజ్ఞానంతో హ్యాక్ చేయొచ్చని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఆ కారణంగానే ఎంతో అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఎన్నికల్లో ఈవీఎంలను పక్కనపెట్టి ఇప్పటికీ బ్యాలెట్ పేపర్ల పద్ధతినే వినియోగిస్తున్నాయని అన్నారు. ప్రతీ ఆరు నెలలకే ఒకసారి సెల్ఫోన్లు మార్చేస్తున్న నేటి రోజుల్లోనూ ఇంకా మనం ఏళ్లతరబడి వాడుతున్న ఈవీఎంలనే మళ్లీ మళ్లీ వినియోగిస్తున్నాం అని ఎన్నికల నిర్వహణను చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఎన్నికల నిర్వహణలో లోపాలు, ఈవీఎంల వినియోగం, ఎన్నికల సంఘం వైఖరిని నిరసిస్తూ ఢిల్లీలోని కానిస్టిట్యూషనల్ క్లబ్లో ప్రతిపక్షాలన్నింటితో కలిసి భేటీ అయిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపైనా చంద్రబాబు విమర్శలు గుప్పించారు. తెలంగాణలో సాంకేతికత పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేశారని... 25 లక్షల ఓట్లు తొలగించారని ఆరోపించిన చంద్రబాబు.. అందుకే ఎన్నికల నిర్వహణ అనంతరం అధికారులు క్షమాపణ చెప్పారని అభిప్రాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఎన్నికలు ముగిశాయి. అయినప్పటికీ తాను గళం విప్పుతున్నానంటే అందుకు కారణం ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడాలనే లక్ష్యమే అని చంద్రబాబు తెలిపారు.
ఇదిలావుంటే, తెలంగాణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేశారన్న చంద్రబాబు వ్యాఖ్యలకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇదే ఈవీఎంలతో గెలిచినప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకు వచ్చినట్టు అని చంద్రబాబుని నిలదీసిన కేటీఆర్.. ఇప్పుడు వేరేవాళ్లు గెలిచారనో లేక టీడీపి ఓడిపోతుందేమోననే భయంతోనే ఈవీఎంల వినియోగంపై చంద్రబాబు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.