జగన్ కోసమే డేటా చోరి కేసు: కేసీఆర్‌పై టీడీపి ఫైర్

డేటా చోరి కేసు జగన్ కోసమే : కేసీఆర్‌పై టీడీపి ఫైర్

Last Updated : Mar 13, 2019, 09:45 AM IST
జగన్ కోసమే డేటా చోరి కేసు: కేసీఆర్‌పై టీడీపి ఫైర్

అమరావతి: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై ఏపీ అధికార పార్టీ టీడీపీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వెళ్లగక్కింది. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రజాధనం దుర్వినియోగం చేస్తోందని టీడీపీ ఆరోపించింది. కేసీఆర్‌కి బహిరంగ లేఖ రాసిన ఏపీ టీడీపీ అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావు.. ఏపీలో జగన్ గెలుపు కోసం కేసీఆర్ గట్టిగా ప్రయత్నిస్తున్నారని, అదే సమయంలో కేసీఆర్ ఎలా చెబితే జగన్ అలా వింటున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఏపీలో టీడీపి గెలుపు తథ్యం అని కిమిడి ధీమా వ్యక్తంచేశారు. 

ఏపీలో టీడీపి సర్కార్‌ని ఎదుర్కునే ధైర్యం లేని జగన్ కోసం మీరు (కేసీఆర్) రూ.2000 కోట్లు పంపిస్తున్నారనేది సత్యం కాదా అని ఈ సందర్భంగా కిమిడి కళావెంకట్రావు ప్రశ్నించారు. అభ్యర్థులకు బీ-ఫారం ఇవ్వడం నుంచి మొదలుపెడితే, అన్ని విషయాల్లోనూ మీరు(కేసీఆర్) చెప్పినట్టుగా వింటున్న జగన్‌ని సంతృప్తిపరచడంతోపాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి ప్రతిష్టను దెబ్బతీయడానికే డేటా చోరి కేసు నమోదు చేశారని కళావెంకట్రావు ఆరోపించారు. డేటా చోరి కేసు విషయంలో మీరే అన్నీ తానై జగన్ వెనుకుండి నడిపిస్తున్నారన్న కళావెంకట్రావు.. ఈ లేఖలో కేసీఆర్‌పై మరెన్నో ఆరోపణలు గుప్పించారు.

Trending News