YS Jagan on AP New Liquor Policy: రాష్ట్రంలో పాలన, సంక్షేమం పూర్తిగా అస్తవ్యస్తమైందని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్రస్ధాయి వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. చెడిపోయిన వ్యవస్థపై మనం యుద్ధం చేస్తున్నామన్నారు. వాళ్లు అబద్ధాలు సృష్టించి ప్రచారం చేస్తున్నారని.. మనం అంతకన్నా బలంగా తయారు కావాలని సూచించారు. పూర్తి సమన్వయంతో అందరూ కలిసి పని చేయాలని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తగిన సమయం ఉంటుందన్నారు. గ్రామస్థాయిలో పార్టీ బలంగా ఉండాలని.. పార్టీ నిర్మాణంలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మనం ఇంట్లో కూర్చుంటే ఏమీ జరగదన్న జగన్.. చొరవ తీసుకుని అన్ని అంశాలపై స్పందించాలని చెప్పారు.
ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూసి ఉండమని.. నాలుగు నెలల్లోనే ఈ ప్రభుత్వం వద్దురా అని ప్రజలు చెప్పే పరిస్థితి వచ్చిందని మాజీ సీఎం అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ప్రజలు నిలదీస్తారని.. బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేకపోతున్నారని విమర్శించారు. ప్రతిపక్షంలో కూర్చునేందుకు అయినా వెనుకాడం అని.. అబద్దాలు మాత్రం చెప్పలేమన్నారు. జగన్ తమకు పలావు పెట్టాడని.. చంద్రబాబు బిర్యానీ పెడతానని చెప్పి మోసం చేశాడని ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోందన్నారు. ఇప్పుడు ఉన్న పలావు పోయిందని.. బిర్యానీ లేదని అనుకుంటున్నారని అన్నారు.
ఈ ప్రభుత్వంలో మద్యం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు జగన్. మద్యం షాపుల కోసం అధికార పార్టీ ఎమ్మెల్యేలు 30 శాతం ఇస్తావా.. 40 శాతం ఇస్తావా.. అని బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. మద్యం షాపుల కోసం కిడ్నాప్‌లు కూడా చేస్తున్నారని.. నిజంగా లిక్కర్ పాలసీలో దురుద్దేశాలు లేకపోతే ఎమ్మెల్యేలు ఎందుకు పోటీ పడుతున్నారని ప్రశ్నించారు. లిక్కర్ రేట్లు తగ్గిస్తామని చెప్పినా.. రేట్లు అలాగే ఉన్నాయన్నారు.
"కష్టం లేనిదే మనకు అందలం రాదు. 16 నెలలు నేను జైలుకు పోతేనే ముఖ్యమంత్రి అయ్యాను. ఎవరూ చూడని వేధింపులు నేను చూశాను. అకారణంగా 16 నెలలు ఒక వ్యక్తిని జైల్లో పెట్టడం అన్నది ఎప్పుడూ జరగలేదు. ఒక పార్టీ లేకుండా చేయాలని, ఒక వ్యక్తిని వేధించాలన్న ఉద్దేశంతోనే ఆ స్ధాయి వేధింపులు చేశారు. అన్ని నెలలు జైల్లో పెట్టిన తర్వాత, ముఖ్యమంత్రి స్ధానంలోకి వచ్చి ప్రజలకు మంచి చేసే అవకాశం దేవుడు ఇచ్చాడు. మనం మంచి చేయగలిగాం. దాని అర్ధం అన్యాయం జరగినప్పుడు ఒక మంచి జరుగుతుంది. చీకటి తర్వాత వెలుగు వస్తుంది. దేవుడు మంచికి తోడుగా ఉంటాడు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు వస్తాయి. నష్టాలుంటాయి. ఒక్కోసారి జైలుకు కూడా పోవాల్సి ఉంటుంది. అయితే ఏంటి? ఇవన్నీ జరిగినప్పుడే మనిషి ఎదుగుతాడు. ప్రజల్లోనూ, నాయకత్వం దగ్గర మన్ననలు ఉంటాయి. అన్నీ ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. మన భవిష్యత్ కోసం మనం చేస్తున్నామని గుర్తు పెట్టుకొండి. మన పార్టీ కోసం, మనం అధికారంలోకి రావాలన్న సంకల్పంతో పేదవాడికి మన వల్ల మంచి జరుగుతుందన్న స్ధిరమైన నమ్మకంతో అడుగులు వేస్తున్నాం. ఈ విషయం ప్రతి ఒక్కరూ మనసులో పెట్టుకొండి. ఈ విషయాలను కచ్చితంగా అందరూ గుర్తు పెట్టుకోవాలి.." అని మాజీ సీఎం జగన్ సూచించారు.
Also Read: OTT Releases: ఓటీటీ ప్రేమికులకు గుడ్‌న్యూస్, రేపు 15 సినిమాలు, వెబ్‌సిరీస్‌లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.