Janasena Glass Symbol: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తు వివాదం రేపుతోంది. ఇవాళ్టితో నామినేషన్ల ఉపసంహరణ కూడా పూర్తి కావడంతో ఇండిపెండెంట్ అభ్యర్ధులకు గుర్తుల కేటాయింపు పూర్తయింది. ఈ నేపధ్యంలో కూటమిలోని కొందరు అభ్యర్ధులకు టెన్షన్ పట్టుకుంది.
ఏపీ ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమిగా పోటీ చేస్తున్నాయి. మొత్తెం 175 అసెంబ్లీ స్థానాల్లో జనసేన 21 స్థానాల్లోనూ, బీజేపీ 10 అసెంబ్లీ స్థానాల్లోనూ పోటి చేస్తుండగా మిగిలిన స్థానాల్లో తెలుగుదేశం పోటీ చేస్తోంది. ఇక లోక్‌సభ స్థానాల విషయంలో జనసేన 2, బీజేపీ 6 స్థానాల్లో పోటీ చేస్తుండగా మిగిలిన 17 స్థానాల్లో తెలుగుదేశం పోటీ చేస్తోంది. నామినేషన్ల ఉపసంహరణకు ఇవాళ్టితో గడువు ముగియడంతో ఇండిపెండెంట్ అభ్యర్ధులకు గుర్తుల కేటాయింపు జరుగుతోంది. జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసు ఫ్రీ సింబల్ జాబితాలో ఉండటంతో కూటమి అభ్యర్ధులకు ఊహించినట్టే షాక్ తగులుతోంది. జనసేన పోటీ చేస్తున్న స్థానాల్లో కాకుండా ఇతర స్థానాల్లో ఇండిపెండెంట్లకు గాజు గ్లాసు కేటాయించవచ్చు. ఇందులో భాగంగానే జనసేన పోటీలో లేని స్థానాల్లో ఇండిపెండెంట్ అభ్యర్ధులకు ఎన్నికల సంఘం గాజు గ్లాసు కేటాయించింది.
మరీ ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన రెబెల్ అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు దక్కడంతో కూటమి పార్టీలకు టెన్షన్ పట్టుకుంది. విజయనగరంలో తెలుగుదేశం రెబెల్ అభ్యర్ధిగా బరిలో దిగిన మీసాల గీతకు ఎన్నికల సంఘం గాజు గ్లాసు కేటాయించడంతో అటు తెలుగుదేశం ఇటు జనసేన నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎన్నికల సంఘం అధికారులు మాత్రం నిబంధనల మేరకే గుర్తు కేటాయించినట్టు చెబుతున్నారు. జనసేన గుర్తు గాజు గ్లాసు ఇప్పటికే జనంలో వెళ్లి ఉంది. అందుకే పార్టీ అభ్యర్ధులకు భయం పట్టుకుంది.
ఇదే పరిస్థితి తూర్పు గోదావరి జిల్లాలో కొంతమందికి ఎదురైంది. ఈ జిల్లాలో జనసేనకే ఇబ్బందిగా మారింది. జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన టికెట్ ఆశించి భంగపడిన పాఠంశెట్టి సూర్యచంద్ర రెబెల్ అభ్యర్ధిగా బరిలో నిలిచారు. ఈ స్థానం తెలుగుదేశంకు కేటాయించడంతో సూర్యచంద్ర ఆవేదన రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. ఇప్పుడితనికి గాజు గ్లాసు సింబల్ దక్కడంతో టీడీపీ అభ్యర్ధి జ్యోతుల నెహ్రూకు భయం పట్టుకుంది. అదే విధంగా ఎస్ కోట నుంచి జనసేన పార్టీ రెబెల్ అభ్యర్ది లోకాభిరామ కోటి కూడా గాజు గ్లాస్ గుర్తుతో బరిలో నిలుస్తున్నారు. ఇంకా ఎక్కడెక్కడ గాజు గ్లాసు ఇండిపెండెంట్ అభ్యర్ధులకు దక్కిందనే పూర్తి వివరాలు రేపటికి రానున్నాయి.
మొత్తానికి జనసేన గుర్తు గాజు గ్లాసు కూటమికి గట్టిగానే గుచ్చుకోనుంది. ఎందుకంటే ఈ పరిస్థితి ముఖ్యంగా తెలుగుదేశం, బీజేపీ పోటీ చేసే అన్ని స్థానాల్లో ఎదురుకావచ్చు. అందులోనూ రెబెల్స్ బరిలో ఉన్న ప్రాంతాల్లో తలెత్తితే కూటమికి మరింత ఇబ్బంది కావచ్చు.
Also read: Special Trains: గుడ్ న్యూస్..ఎన్నికల పండగ వేళ ప్రత్యేక రైళ్లు.. ఎప్పటి నుంచంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook