Navdeep drugs case: డ్రగ్స్ కేసు మరోసారి టాలీవుడ్ ను షేక్ చేస్తోంది...! నార్కోటిక్ పోలీసుల విచారణకు హాజరైన నవదీప్.. ఎవరెవరి పేర్లు చెప్తాడో అనే టెన్షన్ డ్రగ్ కన్స్యూమర్స్ లో నెలకొంది. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు నవదీప్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.. అజ్ఞాతంలోకి వెళ్లిన నవదీప్ ను ఒక్క నోటీస్ తో విచారణకు వచ్చేలా చేసిన పోలీసులు.. మొదటి రోజు కూడా సుదీర్ఘంగా విచారించారు. సమాధానాలు దాటవేసే ప్రయత్నం చేసినా.. పూర్తి ఆధారాలను నవదీప్ ముందు ఉంచేసరికి బిత్తరపోవడం నవదీప్ వంతయ్యింది.
మాదాపూర్ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ నిందితులు ఇచ్చిన సమాచారంతో.. హీరో నవదీప్ కు పోలీసులు నోటీసులు అందజేశారు. 41crpc కింద నోటీసులు ఇచ్చి నార్కోటిక్ పోలీసుల ముందు హజరవ్వాలని సూచించారు. దీంతో.. శనివారం ఉదయం 11 గంటలకు నవదీప్ విచారణకు హాజరయ్యాడు. నవదీప్ మాత్రమే.. సింగిల్ గా నార్కోటిక్ కార్యాలయానికి చేరుకున్నాడు. ఉదయం 11 గంటల నుంచి నవదీప్ ను సుదీర్ఘంగా విచారించారు. నార్కోటిక్ ఎస్పీలు సునీతా రెడ్డి, గుమ్మి చక్రవర్తి, ఏసిపి నర్సింగ్ రావు, ఇన్స్పెక్టర్ రాజేష్ తో కూడిన బృందం.. నవదీప్ ను విచారించారు.
మొదటి గంట పాటు.. నవదీప్ మౌనంగా ఉండటమే కాకుండా, అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు దాటవేసినట్లు తెలుస్తోంది. దీంతో.. నవదీప్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్, సినీ రంగ ప్రవేశం, వ్యాపారాలు, బిజినెస్ పార్ట్నర్స్, డ్రగ్స్ అలవాటు.. ఇలా ప్రతీది క్షుణ్ణంగా అడిగారు. డ్రగ్స్ అలవాటు ఎప్పటి నుంచి.. ఎలా మొదలైంది. ఎక్కడ, ఎవరితో డ్రగ్స్ తీసుకునే వాళ్ళు, ఎవరి నుంచి కొనుగోలు చేసేవాళ్ళు అనే వివరాలు రాబట్టారు. గతంలో డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉన్న తాను.. కొన్నేళ్లుగా డ్రగ్స్ కి దూరంగా ఉంటున్నట్లు నవదీప్ నార్కోటిక్ అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. మాదాపూర్ డ్రగ్స్ కేసులో తన పేరు వినిపించే సరికి షాక్ అయ్యాను అని.. మీడియా లో చూసే వరకు తనకు ఏ విషయం తెలియదు అని చెప్పినట్లు సమాచారం. మాదాపూర్ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ రాంచంద్ తనకు స్నేహితుడే కానీ.. రాంచంద్ కి డ్రగ్స్ తో సంబంధాలు ఉన్నట్లు తెలియదు అని విచారణలో చెప్పాడు నవదీప్. దీంతో.. రాంచంద్, నవదీప్ మధ్య జరిగిన బ్యాంక్ లావాదేవీలను నవదీప్ ముందు ఉంచారు నార్కోటిక్ పోలీసులు. అయితే.. రాంచంద్ తో చేసిన లావాదేవీలు అన్నీ వ్యాపరపరమైనవే తప్ప డ్రగ్స్ కి ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు నవదీప్.
మాజీ ఎంపీ విఠల్ రావు కుమారుడు సురేష్ తోనూ నవదీప్ కు డ్రగ్ లింకులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీళ్లిద్దరి మధ్య బ్యాంక్ లావాదేవీలు జరిగినట్లు ఆధారాలు నవదీప్ ముందుంచారు పోలీసులు. అయితే.. సురేష్ తనకు మిత్రుడని, తనతో వ్యాపార పరమైన సంబంధాలు ఉన్నట్లు నవదీప్ చెప్పినట్లుగా తెలుస్తోంది.
టాలీవుడ్ డ్రగ్స్ కేసు మొదలుకుని, మాదాపూర్ డ్రగ్స్ కేసు వరకు హైదరాబాద్ లో ఏ డ్రగ్ పార్టీ జరిగినా నవదీప్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. నవదీప్ నుంచే సిటీలో కొందరు సెలబ్రిటీలకు డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కొన్ని పబ్స్ కి కూడా నవదీప్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ విషయాలపైనా నవదీప్ ను ప్రశ్నించారు నార్కోటిక్ అధికారులు. మాదాపూర్ డ్రగ్స్ కేసు నిందితులు కల్హర్ రెడ్డి, మోడల్ శ్వేత, పబ్ ఓనర్లు సూర్య, అర్జున్, షాడో సినిమా ప్రొడ్యూసర్ ఉప్పలపాటి రవి, సినీ ఫైనాన్షియర్ వెంకట రత్నం, బాలాజీలతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని నవదీప్ పోలీసుల విచారణలో చెప్పాడు.
మొదటి రోజు సుదీర్ఘ విచారణ ఎదుర్కున్న నవదీప్ ను నార్కోటిక్ పోలీసులు మరోసారి విచారించనున్నారు. పూర్తి ఆధారాలతో.. నవదీప్ ను విచారిస్తున్న నార్కోటిక్ అధికారుల బృందం.. మరింత కీలకమైన సమాచారం రాబడుతోంది. నవదీప్ ను మాదాపూర్ డ్రగ్స్ కేసు తోపాటు.. గతంలో టాలీవుడ్ డ్రగ్స్ కేసు పైనా విచరిస్తుండటం తో... విచారణలో ఎవరెవరి పేర్లు చెప్తాడా అనే గుబులు కొందరు సెలబ్రిటీలను వేధిస్తోంది. నవదీప్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసిన వారిలో సెలబ్రిటీలతో పాటు.. సెలబ్రిటీల పిల్లలు కూడా ఉండటంతో.. ఎవరి పేర్లు తెరపైకి వస్తాయా అనే ఉత్కంఠ నెలకొని ఉంది.