IND vs AUS 1st ODI Match: ఇండియా vs ఆస్ట్రేలియా జట్ల మధ్య 3 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి వన్డేలో భారత్ ఐదు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. మహమ్మద్ షమీ దూకుడు బౌలింగ్ తో పాటు టీమిండియా ఓపెనర్స్ శుభ్‌మాన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్ రెచ్చిపోవడంతో మరో 8 బంతులు మిగిలి ఉండగానే భారత్ విజయం సొంతం చేసుకుంది.
మొహమ్మద్ షమీ తన బౌలింగ్ కి మరోసారి పదును పెట్టడంతో ఈ మ్యాచ్ లో 5 వికెట్లు తీసి 51 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఫలితంగా తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా ఆస్ట్రేలియాను 276 పరుగులకే పరిమితం చేయడంలో సక్సెస్ అయింది.
ఈ మ్యాచ్ లో శార్థూల్ థాకూర్ పూర్తిగా విఫలమయ్యాడు. సొంతగడ్డపైనే జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో 10 ఓవర్లలో 78 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. జస్ప్రిత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్, రవింద్ర జడేజాలు సైతం ఈ మ్యాచ్ లో ఆశించనంతగా రానించలేకపోయారు. లేదంటే కంగారులను అంతకంటే తక్కువ స్కోర్ కే, అంతకంటే తక్కువ ఓవర్లలోనే ఆలౌట్ చేసే అవకాశం ఉండేది.
278 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత ఓపెనర్లలో శుబ్‌మన్ గిల్ మరోసారి 63 బంతుల్లో 74 పరుగులు చేసి తన మార్క్ చూపించగా.. రుతురాజ్ గైక్వాడ్ సైతం 77 బంతుల్లో 71 పరుగులు చేసి ఓపెనింగ్ స్టాండ్‌కు 142 పరుగులు జోడించి విజయానికి గట్టి పునాది వేశారు.
ఆ తరువాత కేఎల్ రాహుల్ సైతం 63 బంతుల్లో 58 పరుగులు ( నాటౌట్ ) చేయగా, ఆ తరువాత బ్యాటింగ్ కి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 49 బంతుల్లో 50 పరుగులు చేసి టీమిండియా విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. శ్రేయాస్ అయ్యర్ 3 పరుగులు, ఇషాన్ కిషన్ 18 పరుగులు, రవింద్ర జడేజా 3 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.
బౌలింగ్ లో మొహమ్మద్ షమీ దూకుడు, బ్యాటింగ్ లో నలుగురు ఆటగాళ్ల సమిష్టి కృషితో టీమిండియా 48.4 ఓవర్లలోనే విజయం సొంతం చేసుకుని సిరీస్ లో పై చేయి సాధించింది. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడం జంపా 2 వికెట్లు తీసుకోగా ప్యాట్ కమిన్స్, సీన్ అబ్బాట్ చెరో వికెట్ తో రాణించారు. మ్యాట్ షార్ట్ వికెట్లు తీసుకోలేకపోయినప్పటికీ... టీమిండియాకు పరుగులు రానివ్వకుండా అడ్డుకోగలిగాడు.