న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలపై ప్రకృతి కన్నెర్ర చేసింది. ఇసుక తుఫానుకు తోడు భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టించాయి. అలాగే పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. కొన్ని చోట్ల కొండ చరియలు విరిగి పడగా.. ఇళ్లు కూడా ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనల్లో దాదాపు 100 మందికి పైగా మృతి చెందారు. అలాగే ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈదురు గాలులకు 70 మంది మృత్యువాత పడ్డారు. అలాగే ఇళ్లు కూలిని ఘటనల్లో మరో 47 మంది గాయపడ్డారు. రాజస్థాన్‌లో 36 మంది చనిపోగా.. 100 మందికిపైగా గాయపడ్డారు. గంటకు 100కి.మీ వేగంతో ప్రచండ గాలులు బుధవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో విరుచుకుపడటంతో ఇప్పటివరకు రెండు రాష్ట్రాల్లో 106 మంది చనిపోగా.. 186 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు.
యూపీలోని ఆగ్రా జిల్లాలో ఈ పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఈ ఒక్క జిల్లాలోనే 43 మంది చనిపోగా.. 51 మంది గాయపడ్డారు. ఆగ్రా తరువాత బిజ్నోర్, బరేలీ, సహరన్పూర్, ఫిల్బిత్, ఫిరోజాబాద్, చిత్రకూట్, ముజాఫర్‌నగర్, రాయ్‌బరేలీ, ఉన్నావో జిల్లాలలో వాతావరణం ఆందోళన కలిగించేలా మారింది. అటు రాజస్థాన్‌లోని భరత్పూర్ జిల్లాలో 19 మంది మృతి చెందారు. ఆళ్వార్‌లో తొమ్మిది, ధోల్పూర్లో ఎనిమిది మంది మృతి చెందారని అధికారులు వెల్లడించారు. గాయపడ్డవారికి ప్రాధమిక చికిత్స అందిస్తున్నారు. సహాయ కార్యక్రమాలు యుద్ధప్రాతిపదికపై జరుగుతున్నాయని, నష్టం వివరాలు అందాల్సి ఉందని, పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేశామని డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యదర్శి హేమంత్‌కుమార్ గేరా తెలిపారు.
మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడ్డవారికి రూ. 60వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. యూపీ, రాజస్థాన్‌లో ప్రకృతి విలయం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులను ఆదుకుంటామని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని రాజస్థాన్ సీఎం వసుంధరరాజే, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.