DIPCOVAN kit price, uses, testing process:న్యూఢిల్లీ: కరోనాపై పోరులో రక్షణ శాఖ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) దూసుకుపోతోంది. ఇటవలే కరోనా రోగుల కోసం 2డీజీ డ్రగ్‌ను రిలీజ్ చేసిన డీఆర్డీఓ.. తాజాగా సులువుగా, పెద్దగా ఖర్చు లేకుండా కరోనా పరీక్షలు నిర్వహించేందుకు కరోనా యాంటీబాడీలను గుర్తించే టెస్టింగ్ కిట్‌ను కూడా రూపొందించిన సంగతి తెలిసిందే. డిప్‌కొవాన్ కిట్ (DIPCOVAN kit) పేరుతో డీఆర్డీవో సైంటిస్టులు డిజైన్ చేసిన ఈ కిట్ సహాయంతో 99 శాతం అక్యురసీతో శరీరంలో కరోనా వైరస్ ఆనవాళ్లను గుర్తించవచ్చని రక్షణ శాఖ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో ఈ కిట్ పని తీరు, ధర, ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆయా సందేహాలకు సమాధానమే ఈ కథనం.
డీఆర్డీఓకు చెందిన డిఫెన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ అలైడ్ సైన్సెస్ (DIPAS), వాన్గార్డ్ డయాగ్నస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ (Vanguard Diagnostics Pvt Ltd) సంస్థలు సంయుక్తంగా కలిసి తయారు చేసిన ఈ టెస్ట్ కిట్ ఉత్పత్తి, విక్రయానికి ఐసీఎంఆర్, డీసీజీఐ, సీడీఎస్‌సీవో సంస్థల నుంచి అనుమతులు కూడా లభించాయని డీఆర్డీఓ తెలిపింది.
వెయ్యి మంది పేషెంట్ల శాంపిల్స్‌పై పరీక్షలు:
డిప్‌కొవాన్ కిట్ అభివృద్ధి, సామర్థ్యం పరీక్షల్లో భాగంగా కొవిడ్ దవాఖాన్లలో వెయ్యి మంది రోగుల నుంచి సేకరించిన శాంపిల్స్‌ను డిప్‌కొవాన్ టెస్టింగ్ కిట్‌తో పరీక్షించి చూడగా ఆశించిన ఫలితాలు వచ్చాయని.., ఆ తరువాతే డిప్‌కొవాన్ కిట్‌ని ఓకే చేసినట్టు రక్షణ శాఖ వెల్లడించింది.
How DIPCOVAN kit works; డిప్‌కొవాన్ టెస్ట్ కిట్ ఎలా పనిచేస్తుందంటే..
శరీరంలోని సీరంలో (Plasma) తయారైన కరోనావైరస్ యాంటీజెన్లకు వ్యతిరేకంగా ఏర్పడిన ఇమ్యునోగ్లోబులిన్ జీ ప్రొటీన్లను (IgG antibodies in human serum or plasma) డిప్‌కొవాన్ గుర్తిస్తుంది. ఫలితంగా 75 నిమిషాల్లోనే కొవిడ్-19 రిపోర్ట్ కూడా వస్తుంది.
రూ. 75కే ఒక టెస్టు చొప్పున ఒక్కో కిట్‌కి వంద టెస్టులు చేసే అవకాశం ఉంటుంది. జూన్ మొదటి వారంలో డిప్‌కొవాన్ కిట్లను వాన్గార్డ్ డయాగ్నస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. మొదట 100 కిట్లు (10 వేల టెస్టుల సామర్థ్యం) మార్కెట్లోకి విడుదల కానుండగా ఆ తర్వాత నెలకు 500 కిట్లు సామర్థ్యంతో ఉత్పత్తి చేయనున్నట్టు డీఆర్డీఓ స్పష్టంచేసింది. ఒక్కో కిట్ షెల్ఫ్‌లైఫ్ 18 నెలల కాలం పాటు ఉంటుంది.
ఈ ప్రయోగంలో విజయం సాధించినందుకు డీఆర్డీఓ చైర్మన్ జి సతీష్ రెడ్డి (DRDO chairman Dr G Satheesh Reddy), డీఆర్డీఓ శాస్త్రవేత్తలు, వాన్గార్డ్ సంస్థను రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) ప్రత్యేకంగా అభినందించారు.