26 నవంబర్, 2008.. ఆ రోజు చరిత్ర మరిచిపోలేని రోజు. టెర్రరిస్టులు ముంబయి నగరాన్ని చుట్టుముట్టి, ఎందరో అమాయక ప్రజలను బలిగొన్న రోజు అది. అయితే అదే రోజు భారతదేశ పర్యటన నిమిత్తం వచ్చిన అప్పటి పాక్ విదేశాంగ మంత్రితో, ఆనాటి భారత విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ మాట్లాడారట. ఆ విషయాన్ని తన తాజా పుస్తకం "ది కొలేషన్ ఇయర్స్ 1996 - 2012"లో తెలియజేశారు ఆయన. ముంబయిలో వరుసగా దాడులు జరుగుతున్న సందర్భంలో.. భారత్ పర్యటనలో పాక్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషీ ఉన్నారన్న విషయం ఎప్పుడైతే తెలిసిందో ప్రణబ్ ముఖర్జీ ఆయనతో ఫోన్ ద్వారా మాట్లాడడానికి ప్రయత్నించారట. అయితే ఎందుకో అది కుదరలేదు.
అదే సమయంలో భారత్లో తను ఉన్నచోట ప్రెస్ కాన్ఫరెన్సు పెట్టడానికి సిద్ధమవుతున్నారు ఖురేషీ. ఒకవేళ ఆ కాన్ఫరెన్సు గనుక జరిగితే, మరింత అలజడి చెలరేగే అవకాశం ఉందని భావించిన ప్రణబ్ ముఖర్జీ, వెంటనే తనకు తెలిసిన ఓ పత్రిక రిపోర్టరుకి ఫోన్ చేసి విషయం తెలియజేశారు. వెంటనే తనతో ఖురేషీని మాట్లాడించడమని తెలిపారు. ఖురేషీతో మాట్లాడే అవకాశం చిక్కగానే, అతను ఇలాంటి సమయంలో భారత్లో ఉండడం శ్రేయస్కరం కాదని, తిరిగి వెంటనే పాకిస్తాన్ వెళ్లిపొమ్మని, అతను వెళ్లేందుకు తాము ఎయిర్ క్రాఫ్టు కూడా సిద్ధం చేశామని అన్నారట. అయితే అంత అవసరం లేదని, సొంత విమానంలో తిరిగి వెళ్లిపోతానని ఖురేషీ చెప్పారట. అయితే ఇదే విషయం మీద అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బిజెపి నుండి విమర్శలు కూడా ఎదుర్కొందని ఆయన పుస్తకంలో తెలిపారు.