పూణెలో శుక్రవారం అర్థరాత్రి దాటాకా శనివారం తెల్లవారుజామున తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రాత్రి 1:30 గంటల ప్రాంతంలో ఓ భారీ అపార్ట్మెంట్కి ఒక వైపున నిర్మించి వున్న పార్కింగ్ లాట్ స్థలానికి సంబంధించిన ప్రహరి గోడ కూలిన ఘటనలో ఆ ప్రహరి గోడకు అవతలి వైపున నివాసం ఉంటున్న కూలీలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. అర్థరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో బతుకుదెరువు కోసం పొట్టచేతపట్టుకుని వెళ్లిన కూలీల బతుకులు తెల్లవారకుండానే తెల్లారిపోయాయి. ప్రమాదం జరిగిన ప్రాంతంలో భారీ భవనం నిర్మాణం కోసం పనులు జరుగుతున్నాయి. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కూలీలంతా అక్కడ పనిలో పాల్గొంటున్న వారే కావడం గమనార్హం.
జాతీయ విపత్తు నిర్వహణ బృందాలు సహాయచర్యల్లో పాల్గొంటున్నాయి. ఇప్పటికే శిథిలాల కింద నుంచి 15 మంది కూలీల శవాలను వెలికితీశారు. దీంతో ఘటనాస్థలంలో ఎటువైపు చూసినా.. కూలీల శవాలు, వారి బంధువుల ఆర్తనాధాలే కనిపిస్తున్నాయి.