అప్పుడు మోదీతో మొదటి సినిమా.. ఇప్పుడు రాహుల్ గాంధీతో రెండో సినిమా : చంద్రబాబుపై వైఎస్ జగన్ సెటైర్లు

అప్పుడు మోదీతో ఒక సినిమా.. ఇప్పుడు రాహుల్ గాంధీతో మరో సినిమా : చంద్రబాబుపై వైఎస్ జగన్ సెటైర్లు

Last Updated : Dec 23, 2018, 08:16 PM IST
అప్పుడు మోదీతో మొదటి సినిమా.. ఇప్పుడు రాహుల్ గాంధీతో రెండో సినిమా : చంద్రబాబుపై వైఎస్ జగన్ సెటైర్లు

శ్రీకాకుళం: రాష్ట్రం విడిపోవడానికి కారణమైన కాంగ్రె‌స్ పార్టీతో జతకట్టిన చంద్రబాబును ఎలా నమ్మాలని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ ప్రశ్నించారు. 2014లో మోదీతో కలిసి మొదటి సినిమా తీసిన చంద్రబాబు... ఇప్పుడు రాహుల్ గాంధీతో కలిసి రెండో సినిమా తీస్తున్నారని జగన్‌ ఎద్దేవా చేశారు. ఈ రెండు సినిమాల్లో నటులు మారారు తప్ప డైలాగులు మారలేదని జోక్ పేల్చారు. రాష్ట్రాన్ని విడదీసిన కాంగ్రెస్ పార్టీతోపాటు బీజేపీని కూడా నమ్మకూడదు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేంత స్థాయిలో ఉండి కూడా బీజేపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదని జగన్ మండిపడ్డారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా శనివారం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జరిగిన బహిరంగసభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ వైఎస్ జగన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్‌, చంద్రబాబు, బీజేపీలపై తీవ్ర విమర్శలు చేశారు. " 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీకి, కేంద్రంలో బీజేపీకి మద్దతు తెలిపిన పవన్ కల్యాణ్.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇప్పిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. కానీ చివరకు ఆయన ప్రత్యేక హోదానే హత్య చేశారని పవన్‌పై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రత్యేక హోదా ఇప్పిస్తానని వారికి హామీ ఇచ్చి ఆ తర్వాత చేతులెత్తేసిన పవన్ లాంటి వ్యక్తులను మరోసారి ప్రజలు నమ్మొద్దు" అని వైఎస్ జగన్ విజ్ఞప్తిచేశారు. అందుకే చంద్రబాబుకు పవన్‌ కల్యాణ్ ఓ పార్ట్‌నర్‌ అనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని జగన్ పిలుపునిచ్చారు.

Trending News