విశాఖపట్నం రైల్వే స్టేషను నుండి బయలుదేరుతున్న హౌరా ఎక్స్‌ప్రెస్ ద్వారా తాబేళ్ల అక్రమ రవాణా జరుగుతుందని సమాచారం అందగeనే డీఆర్‌ఏ అధికారులు హుటాహుటిన రంగంలోకి దిగి ఒక పెద్ద కన్సైన్‌మెంట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ కన్సైన్‌మెంట్‌లో దాదాపు 1000కి పైగానే చిన్న చిన్న తాబేళ్లు కనిపించడంతో ఆశ్చర్యపోవడం వారి వంతైంది. వస్తువులని చెబుతూ అధికారుల కళ్లు కప్పి తాబేళ్ళను తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దాదాపు అయిదు పెద్ద పెద్ద బ్యాగుల్లో ఈ తాబేళ్లను స్టోర్ చేశారు. ఈ తాబేళ్లను మదనపల్లి నుండి తీసుకొచ్చిన్నట్లు సమాచారం. ఈ స్మగ్లింగ్ మాఫియాలో పలువురు విదేశీయుల హస్తం ఉందని కూడా తెలుస్తోంది. ఈ తాబేళ్లను బంగ్లాదేశ్ పంపిస్తున్నట్లు స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తులు తెలపడంతో పోలీసులు వారి నుండి మరిన్ని వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఆ తాబేళ్లను తరలిస్తున్న వ్యక్తులను వన్యప్రాణి సంరక్షణ చట్టం క్రింద అదుపులోకి తీసుకొని కేసులు కూడా నమోదు చేశారు.
గతంలో కూడా దక్షిణాది రాష్ట్రాల నుండి ఉత్తరాదికి తాబేళ్లను తరలించే ముఠాలు దొరికాయి. చైనా, థాయిలాండ్, ఫిలిప్పీన్స్, కొరియా, జపాన్, సింగపూర్, వియత్నాం లాంటి ప్రాంతాల్లో తాబేళ్ళ మాంసానికి అధిక డిమాండ్ ఉంటోంది. దాదాపు ఆ దేశాల్లో ఒక్కో తాబేలు బరువును బట్టి 50 డాలర్ల నుండి 150 డాలర్ల వరకు అమ్ముడయ్యే అవకాశం ఉంది. అందుకే ఇటీవలి కాలంలో తాబేళ్లను అక్రమంగా తరలించే ముఠాలు చాలా హుషారుగా అధికారుల కళ్లుకప్పి స్మగ్లింగ్ చేస్తున్నాయి. కానీ తాజా కేసులో డీఆర్‌ఏ అధికారులు సమాచారం అందిన తర్వాత రంగంలోకి దిగి ముఠా గుట్టురట్టు చేశారు.
విశాఖలో తాబేళ్ల స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు