Chandrababu Srisailam Tour: రాజకీయాల్లో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై ఒక విమర్శ ఉంది. ఆయన ఎప్పుడు అధికారంలోకి వచ్చినా వర్షాలు రావని ప్రత్యర్థి పార్టీలు విమర్శిస్తుంటాయి. మళ్లీ ఆయన అధికారంలోకి రావడంతో కరువు పరిస్థితులు వస్తాయా? అని ప్రజల్లో భయాందోళన నెలకొని ఉండేది. తాజా పరిస్థితులతో అవన్నీ అవాస్తవాలేనని టీడీపీ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రాజెక్టులు జల కళ సంతరించుకుంటున్నాయి. దీంతో తనపై ఉన్న కరువు ముద్రను చంద్రబాబు తొలగించుకున్నారు. కృష్ణమ్మ పరవళ్లతో శ్రీశైలం ప్రాజెక్టు కళకళలాడుతుండడంతో చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్లనున్నారు. వెళ్లడమే కాకుండా శ్రీశైలం ప్రాజెక్టుకు జల హారతి ఇవ్వనున్నారు.
Also Read: AP New Passbooks: సీఎం చంద్రబాబు విస్మయం.. ఒక్క జగన్ బొమ్మలకే రూ.700 కోట్లు
శ్రీశైలంలో జల హారతి
శ్రీశైలం వద్ద కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నది పొంగి ప్రవహిస్తుండడంతో తెలంగాణ గుండా ఏపీలోకి కృష్ణమ్మ బిరాబిరా పరుగులు పెడుతోంది. శ్రీశైలం డ్యామ్‌లో నీటి మట్టం గంటగంటకు పెరుగుతుండడంతో దాదాపు అన్ని గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఆ నీరు నాగార్జున సాగర్‌లోకి దూకుతోంది. ఇక గోదావరి పరివాహాక ప్రాంతాల్లోనూ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. గోదావరి ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులు కూడా నీటితో కళకళలాడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తూ జలకళ ఏర్పడడంతో ఇన్నాళ్లు తనపై ఉన్న కరువు ముద్రను చంద్రబాబు చెరిపేసుకుంటున్నారు.
Also Read: Amaravati Committee: రాజధాని అమరావతిపై కీలక ముందడుగు.. ఏపీ ప్రభుత్వం కమిటీ ఏర్పాటు
భారీ ఏర్పాట్లు
కృష్ణమ్మ పరవళ్లు తొక్కడాన్ని ప్రత్యక్షంగా చంద్రబాబు వీక్షించనున్నారు. శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించి అక్కడ జల హారతి ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆగస్టు 1వ తేదీన గురువారం శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించనున్నారు. కృష్ణమ్మకు చంద్రబాబు జల హారతి ఇవ్వనున్నారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించింది. జల హారతికి ముందు శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. పరమేశ్వరుడి దర్శనం అనంతరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుంటారని సమాచారం. అయితే ఇప్పటివరకు చంద్రబాబు శ్రీశైలం పర్యటనపై అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ శ్రీశైలం పర్యటన తప్పక ఉంటుందని తెలుస్తోంది. ఈ మేరకు శ్రీశైలంలో ముఖ్యమంత్రి పర్యటనకు ప్రభుత్వ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా తొలిసారి శ్రీశైలం సందర్శిస్తుండడంతో స్థానిక టీడీపీ శ్రేణులు కూడా భారీ ఏర్పాట్లలో మునిగారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి