అమరావతి: నేలపాడులో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక భవనాన్ని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ఆదివారం ఉదయం ప్రారంభించారు. 14.2 ఎకరాల్లో రూ.173 కోట్లతో నిర్మించిన జ్యుడిషియల్ కాంప్లెక్స్‌లో తాత్కాలిక హైకోర్టును ఏర్పాటు చేశారు. 2.52 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో జీ ప్లస్ టూ పద్ధతిలో హై కోర్టు భవన సముదాయాన్ని నిర్మించారు. 23 కోర్టు హాళ్లు, అనుబంధ కార్యాలయాలు, అడ్వకేట్ జనరల్, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కార్యాలయాలు, లాయర్స్ అసోసియేషన్ హాల్, మహిళలకు ప్రత్యేకంగా అసోసియేషన్ హాల్‌ను ఈ భవన సముదాయంలో నిర్మించారు. అడ్వకేట్ చాంబర్, గ్రీవెన్స్ సెల్, న్యాయవాదులకు లైబ్రరీ వంటి సౌకర్యాలు సైతం ఏర్పాటు చేశారు.
Live from the inauguration of Andhra Pradesh High Court with Hon'ble Chief Justice of India Ranjan Gogoi, Amaravati https://t.co/izGkfIqVA0
— N Chandrababu Naidu (@ncbn) February 3, 2019
ఏపీ తాత్కాలిక హై కోర్టు ప్రారంభోత్సవం సందర్భంగానే సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ చేతుల మీదుగా హైకోర్టు శాశ్వత భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. హై కోర్టు శాశ్వత భవన నిర్మాణం భూమి పూజ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సుభాష్ రెడ్డి, జస్టిస్ లావు నాగేశ్వరరావు, ఏపీ, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు పాల్గొన్నారు. 450 ఎకరాల్లో ఏర్పాటు కానున్న కాంప్లెక్స్‌లో దాదాపు రూ.819 కోట్ల వ్యయంతో భౌద్ధ స్థూపాకృతిలో హైకోర్టు శాశ్వత భవన నిర్మాణం జరగనుంది.