CM KCR Speech Telangana Formation Day Celebrations: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల శుభ సందర్భంలో ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు సీఎం కేసీఆర్. నూతన సచివాలయంలో తెలంగాణ అవతరణ దశాబ్ధి ఉత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సచివాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ భావోద్వేగ ప్రసంగం చేశారు. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుంచే తెలంగాణ ప్రజలు తమ అసమ్మతిని తెలియజేశారని అన్నారు. 1969లో ఎగిసిపడిన తెలంగాణ ఉద్యమం రక్తసిక్తమైందన్నారు.
1971లో జరిగిన ఎన్నికల్లో ప్రత్యేక తెలంగాణ డిమాండ్‌కు మద్దతుగా ప్రజాతీర్పు వెలువడినా.. ఆనాటి కేంద్ర ప్రభుత్వం గౌరవించలేదని ముఖ్యమంత్రి అన్నారు. ఉద్యమాన్ని రగిలించేందుకు ప్రయత్నాలు జరిగినా.. నాయకత్వం మీద నమ్మకంలేకపోవడం, సమైక్య పాలకుల కుట్రలతో ఆ ప్రయత్నాలు ఫలించలేదని అన్నారు. 2001 వరకూ తెలంగాణలో నీరవ నిశ్శబ్దం రాజ్యమేలిందన్నారు. “ఇంకెక్కడి తెలంగాణ” అనే నిర్వేదం జనంలో అలుముకున్న సమయంలో.. ఆ నిర్వేదాన్ని, నిస్పృహని బద్దలు కొడుతూ 2001లో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిందని గుర్తుచేశారు. ఆ ఉద్యమానికి నాయకత్వం వహించే చారిత్రాత్మక పాత్ర తనకు లభించినందుకు తన జీవితం ధన్యమైందని భావోద్వేగం అయ్యారు.
మలిదశ ఉద్యమంలోకి క్రమక్రమంగా అన్ని వర్గాలు వచ్చి చేరాయని అన్నారు. స్వరాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలను అర్పించిన త్యాగధనులైన అమరులకు హృదయపూర్వకంగా నివాళులర్పిస్తున్నానని చెప్పారు. 2014లో అధికారంలోకి వచ్చిన రోజు నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం అమరుల ఆశయాలను, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు మనసా వాచా కర్మణా అంకితమైందన్నారు.
సీఎం కేసీఆర్ స్పీచ్ హైలెట్స్
==> అద్భుత ఫలితాలను సాధిస్తూ ప్రగతిపథంలో పరుగులు పెడుతున్న తెలంగాణ నేడు పదో వసంతంలో అడుగు పెట్టడం ఒక మైలురాయి
==> నేటి నుంచి 21 రోజులపాటు ఈ ఉత్సవాలు వేడుకగా నిర్వహిస్తాం.. గ్రామస్థాయి నుంచి రాజధాని నగరం వరకూ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఈ ఉత్సవాల్లో ప్రజలంతా ఉత్సాహంగా పాల్గొనాలి
==> దేశానికి దిక్సూచిగా నిలిచిన తెలంగాణ ప్రగతిని దశదిశలా చాటుదాం. భవిష్యత్ కర్తవ్యాలను నిర్దేశించుకుందాం.
==> అస్పష్టతలను, అవరోధాలను అధిగమిస్తూ తెలంగాణ దేశంలోనే అత్యంత బలీయమైన ఆర్థికశక్తిగా ఎదగడం ఒక చారిత్రాత్మక విజయం.
==> తెలంగాణను పునరన్వేషించుకోవాలి.. తెలంగాణను పునర్నిర్మించుకోవాలి.. అనే నినాదంతో ముందడుగు వేసింది.
==> తొమ్మిదేళ్ల అనతికాలంలోనే అనేక రంగాలలో మన తెలంగాణ దేశానికే స్ఫూర్తినిస్తున్న రాష్ట్రంగా అవతరించింది.
==> తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఈ తొమ్మిదేళ్ల వ్యవధిలో కరోనా మహమ్మారి వల్ల దాదాపు మూడేళ్ల కాలం వృథాగానే పోయింది.
==> ఇక మిగిలిన ఆరేళ్ల స్వల్ప కాలంలోనే వాయువేగంతో రాష్ట్రం ప్రగతి శిఖరాలను అధిరోహించింది.
==> ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా.. ఏ నోట విన్నా తెలంగాణ మోడల్ అనే మాట మార్మోగుతోంది.
==> తెలంగాణ ప్రగతి ప్రస్థానం నేడు పరుగులు తీస్తోందంటే.. అంకితభావంతో పనిచేస్తున్న ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం, ప్రభుత్వోద్యోగులు, ప్రజా సహకారమే కారణం.
==> ఆయా రాష్ట్రాల ప్రజలు తమకు కూడా తెలంగాణ తరహా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు.
==> సంపద పెంచుదాం.. ప్రజలకు పంచుదాం.. అనే నినాదంతో తెలంగాణ సంక్షేమంలో స్వర్ణయుగాన్ని ఆవిష్కరించింది
==> తెలంగాణ తలసరి ఆదాయంలో దేశంలోని పెద్ద రాష్ట్రాలకన్నా మిన్నగా నిలిచింది.
==> ఏ విషయంలో చూసినా.. ఏ కోణంలో చూసినా అనేక రంగాల్లో తెలంగాణ నంబర్ వన్‌గా నిలుస్తోంది
==> దశాబ్ది ఉత్సవాల కానుకగా బీసీ కుల వృత్తుల కుటుంబాలకు కుటుంబానికి లక్ష రూపాయల ఆర్ధికసాయం అందిస్తున్నాం..
==> గొల్ల కుర్మలకు రెండో విడతలో భాగంగా రూ.5 వేల కోట్లతో 3.38 లక్షల మందికి గొర్రెల్ని పంపిణీ చేస్తాం.
==> పోడు సమస్యకు శాశ్వత పరిష్కారంగా గిరిజనులకు ప్రభుత్వం భూములపై హక్కులు కల్పిస్తున్నది. జూన్ 24 నుంచి పోడు పట్టాల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుడుతాం.. అదేవిధంగా రైతుబంధు పథకం వర్తించేలా చర్యలు తీసుకుంటుంది.
Also Read: IND Vs Aus WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు హర్భజన్ టీమ్ ఇదే.. ఆ ప్లేయర్ జట్టులో ఉండాల్సిందే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి