Kishan Reddy visited Kanchanbagh Apollo Hospital: ఆత్మహత్యకు ప్రయత్నించి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న హోంగార్డు రవీందర్‌ను కంచన్‌బాగ్ అపోలో హాస్పిటల్లో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో హోంగార్డుల విషయంలో శ్రమదోపిడీ జరుగుతోందన్నారు. వారికి కనీస హక్కులు ఇవ్వడం లేదని.. హోంగార్డు వ్యవస్థను ప్రభుత్వం పూర్తిగా అవమానిస్తోందని ఫైర్ అయ్యారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు హోంగార్డుల హక్కులు, సంక్షేమం కోసం చట్టసభలో ప్రభుత్వాన్ని నిలదీశానని.. వీళ్ల విషయంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు పరచలేదన్నారు.
"8 గంటల చేయాల్సిన ఉద్యోగాన్ని 16, 24 గంటలు పనిచేస్తున్నారు. హక్కుల కోసం గతంలో హోంగార్డులు పోరాటం చేస్తే.. ఆ సంఘ నాయకులను వేధించారు. కానీ న్యాయం చేయలేదు. హోంగార్డులను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గుర్తించాలి. సెలవులు, ఇతర అలవెన్సులు ఇవ్వాలి. వారి ఆరోగ్యం విషయంలో కూడా సరైన చర్యలు తీసుకోవాలి. హోంగార్డులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తానని ఇవ్వకపోవడంతో వారికి న్యాయం జరగలేదు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి హోంగార్డులకు ఇచ్చిన హామీని అయిదున్నరేండ్ల దాటినా.. అమలు చేయడం లేదు. రవీందర్ ఆత్మహత్యయత్నానికి పాల్పడటం చాలా బాధాకరం.
ఎండ, వాన ఇతర ఇబ్బందుల్లో హోంగార్డులు విధుల్లో స్పృహ తప్పిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఆత్మహత్యాయత్నానికి సంబంధించిన ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరగాలి. రవీందర్ ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రవీందర్ కుటుంబానికి మేము పూర్తి సంఘీభావం ప్రకటిస్తున్నాం.. రవీందర్ ప్రాణాలతో బయటకు రావాలి. ఇది రాజకీయం చేయాల్సిన విషయం కాదు. ఓ వ్యక్తి ప్రాణానికి సంబంధించిన విషయం. ఈరోజు హోంగార్డుల పరిస్థితి దారుణంగా ఉంది. హోంగార్డుల వ్యవస్థను మెరుపరిచేందుకు చర్యలు తీసుకోవాలి. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత హోంగార్డుల సంక్షేమం కోసం అన్నిరకాలుగా కృషి చేస్తాం. హోంగార్డులు ధైర్యంగా ఉండి పోరాడాలి. కానీ..ఆత్మహత్యలకు పాల్పడవద్దని సూచిస్తున్నాను. హోంగార్డుల హక్కుల కోసం శాంతియుతంగా అందరం కలిసి పోరాటం చేద్దాం.. ఎవరూ తొందరపడొద్దు. రవీందర్ కుటుంబానికి బీజేపీ అండగా ఉంటాం.. రవీందర్ ఆరోగ్యాన్ని కాపాడేందుకు పూర్తి ప్రయత్నం చేస్తాం." అని కిషన్ రెడ్డి అన్నారు.
అనంతరం హోంగార్డుల శాంతియుత ధర్నాకు ఆయన మద్దతు తెలిపారు. గత 17 సంవత్సరాలుగా హోంగార్డుగా సేవలు అందిస్తున్న రవీందర్ ఆత్మహత్యయత్నానికి పాల్పడటం దురదృష్టకరమని అన్నారు. ఉంతో దుఖం, బాధతో రవీందర్ ఆ ప్రయత్నం చేసి ఉంటాడని పేర్కొన్నారు. తాను హోంగార్డుల విషయంలో అనేకసార్లు పోరాటం చేశానని.. అప్పట్లో తనపై కేసులు కూడా పెట్టారని చెప్పారు. హోంగార్డుల శ్రమదోపిడీ, వెట్టి చాకిరిపై అనేక రోజులుగా మనం ప్రశ్నిస్తున్నా.. స్పందన లేదన్నారు. రవీందర్ ఆత్మహత్యాయత్నానికి కారణమైన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని.. సీఎం ఇచ్చిన హామీని ఇప్పటికైనా నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
Also Read: Leopard Trap Bone At Tirumala: భక్తుల భద్రత విషయంలో రాజీ లేదు.. టీడీడీ ఛైర్మన్ కీలక ప్రకటన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి