Bandi Sanjay: పీఆర్‌సీకి ఏర్పాటుకు బండి సంజయ్ రిక్వెస్ట్.. సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ

Bandi Sanjay Letter To CM KCR: రాష్ట్రంలో రిటైర్ట్ ఉద్యోగుల్లో చాలా మందికి పెన్షన్ అందక ఇబ్బంది పడుతున్నారని బండి సంజయ్ అన్నారు. వెంటనే పింఛన్ డబ్బులు రిలీజ్ చేయాలని.. ఉద్యోగులకు పీఆర్‌సీ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. లేఖలో పూర్తి అంశాలు ఇలా..    

Written by - Ashok Krindinti | Last Updated : Jun 19, 2023, 05:59 PM IST
Bandi Sanjay: పీఆర్‌సీకి ఏర్పాటుకు బండి సంజయ్ రిక్వెస్ట్.. సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ

Bandi Sanjay Letter To CM KCR: రిటైర్డ్ ఉద్యోగులకు తక్షణమే పెన్షన్‌ను విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. అదేవిధంగా ఉద్యోగులకు పీఆర్సీని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు ఆయన బహిరంగ లేఖ రాశారు. ఉద్యోగుల ఫ్రెండ్లీ  ప్రభుత్వమని చెప్పుకుంటున్న బీఆర్ఎస్ ప్రభుత్వం అసలు వాస్తవాలు తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు.  తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన  ఉద్యోగులతోపాటు పెన్షనర్ల కుటుంబాలు ఎలా ఉన్నాయో ఎప్పుడైనా అడిగి తెలుసుకున్నారా..? అని నిలదీశారు. ఉద్యోగులకు నెలనెలా సక్రమంగా జీతాలివ్వడం లేదని.. రిటైర్డ్ ఉద్యోగులకు సైతం సకాలంలో పెన్షన్‌ను ఇవ్వకపోవడం దారుణమని మండిపడ్డారు. 

"గత రెండు నెలలుగా చాలా జిల్లాల్లో రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్  ఇవ్వలేదు. రిటైర్డ్ ఉద్యోగులకు వృద్దాప్యలో అనేక ఆరోగ్య సమస్యలుంటాయి. ఆసుపత్రులకు, మెడిసిన్, పౌష్టికాహారం కోసం డబ్బులు తప్పనిసరిగా అవసరమవుతాయి. ఇది తెలిసి కూడా వారికి పెన్షన్ సకాలంలో చెల్లించకపోవడం అమానవీయం. ధనిక రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ మీ పాలనా పుణ్యమా అని అప్పుల కుప్పగా మారింది. ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వడం లేదు. 

రిటైర్ అయిన ఉద్యోగులకు అదే రోజున రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని చెప్పిన మీ మాట ప్రకటనలకే పరిమితమైంది. నెలల తరబడి రిటైర్డ్ ఉద్యోగులంతా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఒక్క కరీంనగర్ జిల్లాలోనే 460 మంది ఉద్యోగుల పెన్షన్ ఫైళ్లు ఆర్థికశాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వేలాది  మంది మంది రిటైర్డ్ ఉద్యోగులది ఇదే పరిస్థితి.  

ఉద్యోగులు, పెన్షనర్ల హెల్త్ స్కీమ్‌ను నిర్వీర్యం చేసి, వారికి వైద్య సేవలు అందకుండా చేశారు. ప్రమోషన్లు, పోస్టింగుల్లో మీ వందిమాగదులను నియమించుకుని, అర్హులకు అన్యాయం చేశారు. మీ ప్రభుత్వం నియమించిన పీఆర్సీ కమిషన్ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి ఎన్నో విలువైన సూచనలు చేసినా అమలు చేసిన దాఖలాల్లేవు. ఇదేనా ఎంప్లాయిస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటే..? ఈ నెలాఖరుతో మొదటి పీఆర్‌సీ గడువు ముగియబోతోంది. 

వచ్చే నెల నుంచి కొత్త పీఆర్‌సీ అమల్లోకి రావాలి. కానీ ఇప్పటివరకు మీరు కనీసం పీఆర్‌సీ కమిషన్‌ను నియమించకపోవడమంటే ఉద్యోగులను, ఉపాధ్యాయులను దగా చేయడమే. కొత్త పీఆర్‌సీ అసలు అవసరమే లేదని, ఉద్యోగులు, పెన్షనర్లు మీకు ఓటెయ్యరని మీరు మీ సన్నిహితులతో అన్నట్లుగా పత్రికల్లో వచ్చిన వార్తలు విస్మయానికి గురి చేస్తున్నాయి.." అని బండి సంజయ్ అన్నారు.  

మీరు ఇచ్చే హామీలు, కొట్టే కొబ్బరి కాయలన్నీ ఓట్ల కోసమేనని తెలంగాణ ప్రజలందరికీ తెలుసన్నారు‌. కానీ ఉద్యోగులు, పెన్షనర్ల విషయంలోనూ ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తుండడం బాధాకరమన్నారు. ఒకవేళ ఓట్ల కోణంలో ఆలోచించినా‌ పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యుల ఓట్లు రాష్ట్రంలో 30 లక్షలకు పైనే ఉన్నాయనే విషయాన్ని విస్మరించడం శోచనీయమన్నారు. 
తక్షణమే పెన్షనర్లందరికీ పెన్షన్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే పీఆర్సీ వేసి ఉద్యోగులు, పెన్షనర్లు ఆశిస్తున్న విధంగా వేతనాలు, డీఏ పెంచాలని బీజేపీ తెలంగాణ పక్షాన డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. లేనిపక్షంలో  ఉద్యోగ, ఉపాధ్యాయుల పక్షాన బీజేపీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. 

Also Read: Weather Updates: భారీ ఎండల నుంచి ఉపశమనం.. ఈ ప్రాంతాల్లో వర్షాలు  

Also Read: Delhi Crime: ఢిల్లీలో కలకలం.. ఒకే రోజు ముగ్గురు హత్య  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News