Biryani Orders Suddenly Fall Down In Hyderabad: ఎంతో రుచికరమైన బిర్యానీ ఎవరికైనా ఇష్టం. హైదరాబాద్‌కే పేరు తీసుకొచ్చిన ధమ్ బిర్యానీ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడవుతున్న ఆహారాల్లో ఒకటి. అయితే బిర్యానీ ప్రియులను ఒక వార్త కలవర పెడుతోంది. దీని దెబ్బకు బిర్యానీ ఆర్డర్లు అనూహ్యంగా పడిపోయాయి. కారణమేమిటో తెలుసా?
మాంసాహారంలో అత్యధికంగా అమ్ముడయ్యే వంటకం హైదరాబాద్ బిర్యానీ. ధమ్ బిర్యానీ కనిపిస్తే లొట్టలేసుకుంటూ తినాల్సిందే. వారంతో సంబంధం లేకుండా లాగించేవాళ్లు చాలా మంది ఉన్నారు. రోజుకు లక్షల్లో ఆర్డర్లు వస్తుంటాయి. అయితే ఉన్నఫళంగా బిర్యానీ ఆర్డర్లు తగ్గిపోయాయి.
బిర్యానీ ప్రియులను ఒక వార్త కలవరపరుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపిస్తున్న బర్డ్ ఫ్లూ బిర్యానీ తినేవారి నోటిని కట్టి పడేస్తోంది. కొన్నాళ్లు చికెన్ తినవద్దని అధికారులు సూచిస్తున్నారు. దీని ప్రభావం బిర్యానీపై తీవ్రంగా పడింది.
బర్డ్ ఫ్లూ భయంతో బిర్యానీ ఆర్డర్ పెట్టడం తగ్గించేశారు. చికెన్ బిర్యానీతోపాటు చికెన్ వంటకాలు ప్రజలు తినడం లేదు. ఆన్‌లైన్‌లో లక్షల ఆర్డర్లు కాస్త వేలాదిగా మారినట్లు తెలుస్తోంది. ప్రధాన ఆన్‌లైన్ డెలివరీ యాప్‌లలో కూడా బిర్యానీల బుకింగ్‌లు తగ్గాయని తెలుస్తోంది. బర్డ్ ఫ్లూ వార్తలతో చికెన్ బిర్యానీ అంటేనే భయపడుతున్నారు.
బిర్యానీ అడ్డాగా ఉన్న హైదరాబాద్‌లో చికెన్ బిర్యానీ ఆర్డర్లు తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఆర్డర్లు తగ్గిపోవడంతో హోటల్ నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాదు చికెన్ వంటకాలపై తీవ్ర ప్రభావం ఉంది. చికెన్ 65, తండూరి చికెన్, మలై చికెన్, చికెన్ కర్రీ తదితర చికెన్ వంటకాలు ప్రజలు రుచి చూడడం లేదు. దీంతో కొన్ని హోటళ్లలో బిర్యానీపై ప్రత్యేక ఆఫర్లు పెడుతున్నారు. అయినా కూడా ప్రజల నుంచి ఆశించిన స్పందన లేదు.
ఆన్‌లైన్‌లోనే కాదు హోటల్స్, రెస్టారెంట్లలో కూడా బిర్యానీ తినే ప్రజల సంఖ్య భారీగా తగ్గిపోయింది. గతంలో మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రిపూట బిర్యానీ కోసం కిటకిటలాడిన హోటళ్లు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. ఫ్రైడ్ రైస్ సెంటర్‌లలో కూడా చికెన్ ఆర్డర్ల సంఖ్య తగ్గింది.
బిర్యానీకి ప్రజల నుంచి డిమాండ్ లేకపోవడంతో హోటల్ నిర్వాహకులు బిర్యానీని తక్కువ సంఖ్యలో వండుతున్నారు. బర్డ్ ఫ్లూ ప్రభావంతో హోటళ్లకు గిరాకీ లేకపోవడంతో నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు.