ఆగస్టు 2 నుంచి తెలంగాణలో కొత్త పంచాయతీలు ఏర్పాటు కానున్నాయి. ఈ నేపథ్యంలో సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, డీపీఓలు, డీఆర్డీఓలు, ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులు, కొత్తగా నియమిస్తున్న పంచాయతీ స్పెషల్ ఆఫీసర్స్‌తో మంత్రి జూపల్లి కృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కొత్త పంచాయతీల విషయంలో అవలంబించాల్సిన విధివిధానాలపై మంత్రి జూపల్లి అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణా రావు మీడియాతో మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం ఇలా దేశంలో ఒకేసారి 4 వేలకు పైగా గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసిన ఘనత కేవలం తెలంగాణ సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. దశాబ్ధాల తరబడి ప్రజలు డిమాండ్ చేస్తోన్న 4,383 గ్రామ పంచాయతీలను ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ సర్కార్ ఏర్పాటు చేసిందన్నారు. ఒకేసారి ఇంత భారీ సంఖ్యలో గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని మంత్రి మీడియాకు తెలిపారు.
ప్రజలకు మరింత మెరుగైన పాలన అందించాలనే లక్ష్యంతోనే కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా ఇకపై అధికారులను కలిసేందుకు గ్రామస్తులు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన అవస్థలు తప్పుతాయని మంత్రి పేర్కొన్నారు. అదే సమయంలో గ్రామ సర్పంచుల పదవీ కాలం ముగుస్తుండటంతో వారి స్థానంలో ప్రత్యేక అధికారులను నియమించి గ్రామాభివృద్ధి కుంటుపడకుండా చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి వివరించారు.
ఆగస్టు 2 నుంచే కొత్త గ్రామ పంచాయతీలు