పాకిస్తాన్లో జులై 25వ తేదిన జరిగే ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పలు మతతత్వ పార్టీలతో పాటు ప్రభుత్వం బ్యాన్ చేసిన జామత్ ఉద్ దవా పార్టీ మెంబర్లు కూడా ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. జాతీయ అసెంబ్లీ సీట్ల కోసం జరిగే ఈ ఎన్నికలలో ఈ మతతత్వ పార్టీల తరఫున రికార్డు స్థాయిలో 460 అభ్యర్థులు పోటీ చేయనున్నారు. ఇటీవలే పాకిస్తాన్ ఎన్నికల సంఘం అభ్యర్థుల ఫైనల్ లిస్టు విడుదల చేసింది. ఈ లిస్టు ప్రకారం 272 సాధారణ సీట్లకోసం జరిగే పోటీకి 3459 అభ్యర్థులు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ఎన్నికలలో ప్రధాన మతతత్వ పార్టీగా భావిస్తోన్న ఎంఎంఏ పార్టీ అయిదు పార్టీలతో పొత్తు పెట్టుకొని మరీ బరిలోకి దిగుతోంది. ఈ ఎన్నికలలో ముంబయి దాడులకు వ్యూహకర్తగా వ్యవహరించిన హఫీజ్ సయ్యద్ పార్టీ మిల్లీ ముస్లిమ్ లీగ్ ప్రధానంగా పంజాబ్ ప్రాంతం మీద ప్రత్యేక దృష్టి కేంద్రీకరించనుంది. అయితే మధ్య, దక్షిణ పంజాబ్ ప్రాంతాలలో ఈ పార్టీ ఎలాంటి అభ్యర్థులనూ బరిలోకి దింపడం లేదు.
అయితే హఫీజ్ సయిద్ ఈ ఎన్నికలలో పోటీకి దిగడం లేదు. ఆయన అల్లుడితో పాటు తన కుటుంబానికి చెందిన 13 మహిళలు బరిలో దిగుతున్నారు. కాకపోతే హఫీజ్ సయిద్ పార్టీని అక్కడి ఎన్నికల సంఘం ఒక పార్టీగా గుర్తించడానికి నిరాకరించింది. సయిద్ పార్టీకి చెందిన అభ్యర్థులు అందరూ కూడా అల్లా యు అక్బర్ తహ్రీక్ అనే వేరే పార్టీ అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్నారు. ప్రస్తుతం సయిద్ పై అమెరికాలో వివిధ కేసులు నమోదై ఉన్నాయి. అతన్ని పట్టించిన వారికి 10 మిలియన్ డాలర్ల బహుమతి కూడా అందివ్వగలమని అమెరికా ఎప్పుడో ప్రకటించింది.