కేవలం యుద్ధ ట్యాంకులు, మిస్సైల్స్ మాత్రమే దేశాన్ని కాపాడలేవు అని పాకిస్తాన్ ప్రణాళిక, అభివృద్ధి శాఖ మంత్రి అహ్సన్ ఇక్బాల్ అన్నారు. దేశంలో దశాబ్ధాల తరబడిగా నెలకొన్న రాజకీయ అస్థిరత దేశాభివృద్ధికి అవరోధంగా మారింది అని చెప్పే క్రమంలో పాకిస్తాన్ ఆర్థికాభివృద్ధిని మంత్రి ప్రస్తావించారు. దేశం ఆర్థికంగా పరిపుష్టిగా లేనప్పుడు కేవలం యుద్ధ ట్యాంకులు కానీ లేక మిస్సైల్స్ కానీ కాపాడతాయని భావించడం పొరపాటే అవుతుంది అని మంత్రి అహ్సన్ ఇక్బాల్ అభిప్రాయపడ్డారు. పాక్లో సోమవారం జరిగిన పాకిస్తాన్ నేషనల్ సెంటర్ ఫర్ సైబర్ సెక్యురిటీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ అహ్సన్ ఇక్బాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ది ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ ఓ కథనాన్ని ప్రచురించింది.
1990లో అప్పటి భారత ఆర్థిక శాఖ మంత్రి మన్మోహన్ సింగ్ పాకిస్తాన్ ఆర్థిక శాఖ మంత్రి సర్తాజ్ అజీజ్ నుంచి అడిగి తెలుసుకున్న ఆర్థిక సంస్కరణలను భారత్లో అమలుపరిచి అద్భుతమైన ఫలితాలు రాబట్టుకున్నారు. అలాగే బంగ్లదేశ్లోనూ పాకిస్తాన్ ఆర్థిక సంస్కరణలు మంచి ఫలితాన్ని ఇచ్చాయి. అయితే, భారత్, బంగ్లాదేశ్ లాంటి విదేశాలకు పనిచేసిన పాక్ ఆర్థిక సూత్రాలు స్వదేశానికి మాత్రం పనికిరాలేదు అని అన్నారు అహ్సన్ ఇక్బాల్. అందుకు కారణం పాక్లో తిష్టవేసిన అస్థిరతే అని తేల్చిచెప్పారు.
పాకిస్తాన్ అభివృద్ధి పథంలో దూసుకెళ్లేందుకు 1960లలో తొలిసారిగా అవకాశం వచ్చింది. ఆ తర్వాత 1990లలో రెండోసారి ఆ అవకాశం వచ్చింది. ప్రస్తుతం మూడోసారి ఆ అవకాశం పాక్ ముంగిట వుంది. ఈసారి కూడా గతంలో మాదిరిగానే అస్థిరత కారణంగా ఆ అవకాశాన్ని కోల్పోకూడదు అని ఈ సందర్భంగా అహ్సన్ అక్బాల్ పేర్కొన్నట్టుగా ది ట్రిబ్యూన్ కథనం పేర్కొంది.