PM Modi Hyderabad Visit Schedule: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 26న హైదరాబాద్ రానున్నారు. ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో నేరుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న ప్రధాని మోదీ.. అక్కడి నుంచి గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)కి వెళ్తారు. అక్కడ జరిగే ఐఎస్‌బీ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ వస్తున్నారనే వార్త బీజేపీ వర్గాల్లో మరింత జోష్ నింపింది. ఇప్పటికే ఇటీవలే బీజేపి అగ్రనేతలు జేపీ నడ్డా, అమిత్ షా రాష్ట్రంలో పర్యటించిన సంగతి తెలిసిందే. తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారుతున్న నేపథ్యంలోనే జేపీ నడ్డా, అమిత్ షా రాష్ట్రంలో పర్యటించడం, ఆ రెండు పర్యటనలు విజయవంతం అవడం తెలంగాణ బీజేపీ నేతల్లో నూతనొత్తేజాన్ని నింపింది. ఈ క్రమంలోనే తాజాగా ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన ఖరారవడం ఆ పార్టీ నేతలు, కార్యకర్తలకు మరింత బూస్టింగ్‌నిస్తోంది.
ఇదిలావుంటే, ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను కనివినీ ఎరగని రీతిలో విజయవంతం చేసేందుకు బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రధాని మోదీ బేగంపేటలో దిగింది మొదలు.. తిరిగి హైదరాబాద్ నుండి ఢిల్లీ బయల్దేరేంత వరకు ప్రధాని మోదీకి బీజేపి వైబ్స్ తగిలేలా ఈ పర్యటన ఉండేలా బండి సంజయ్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటించే అన్ని మార్గాల్లో ఆయనకు ఘన స్వాగతం పలుకుతూ భారీ ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాల్సిందిగా ఇప్పటికే పార్టీ శ్రేణులకు సూచించినట్టు తెలుస్తోంది.
ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన యాదృచ్చికమా.. లేక పక్కా ప్లానా ?
ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ వస్తున్నారనే వార్త ఓవైపు బీజేపీ వర్గాల్లో జోష్‌ని నింపుతుండగా.. మరోవైపు ఈ పర్యటన వెనుకున్న కారణాలేంటని ఆరా తీస్తున్న వాళ్లు కూడా లేకపోలేదు. అందుకు కారణం బీజేపీ అగ్రనేతలు తెలంగాణకు క్యూ కడుతుండటమే. అవును.. 20 రోజుల వ్యవధిలో తెలంగాణకు ముగ్గురు అగ్ర నేతలు రావడం అనేక అనుమానాలకు తావిస్తోంది. జేపీ నడ్డా తర్వాత అమిత్ షా రావడం ఒక ఎత్తయితే.. ఇప్పుడు ఐఎస్బీ వార్షికోత్సవం పేరిట ప్రధాని మోదీ రానుండటం మరో ఎత్తు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
తెలంగాణపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించిన బీజేపి అగ్ర నేతలు.. అందులో భాగంగానే ఇలా రాష్ట్రానికి వరుస పర్యటనలు చేపడుతున్నారా అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ప్రధాని మోదీ అధికారిక పర్యటనపైనే వస్తున్నప్పటికీ.. ఈ పర్యటన వెనుకున్న మర్మం మాత్రం రాజకీయ కోణమే అయ్యుంటుందనేది వారి అనుమానం. ఇటీవల అమిత్ షా సైతం హైదరాబాద్‌లో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీలో జరిగిన ఓ అధికారిక కార్యక్రమానికి హాజరైన సందర్భంగానే బీజేపి నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న సంగతి తెలిసిందే.
ముందస్తు ఎన్నికలు.. సమయం లేదు మిత్రమా... ?
తెలంగాణ సర్కారు ఈసారి కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందనే వార్తలొస్తున్నాయి. అంతేకాకుండా ఇటీవలే హైదరాబాద్‌లో ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొని మాట్లాడుతూ.. '' ఇకపై పాద యాత్రలను పక్కకు పెట్టి బస్సు యాత్రలు చేయండి '' అంటూ బండి సంజయ్‌కి సూచించారు. ఎన్నికలకు ఎక్కువ సమయం లేకపోవడం వల్లే అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారనే అభిప్రాయం వ్యక్తమైంది. అంతేకాకుండా ముందస్తు ఎన్నికలు అనే ప్రచారానికి అమిత్ షా (Amit Shah in Hyderabad) వ్యాఖ్యలు మరింత బలాన్ని చేకూర్చాయి. అందుకు తగినట్టుగానే తాజాగా ప్రధాని మోదీ కూడా మరో అధికారిక కార్యక్రమం పేరిట హైదరాబాద్ రానుండటం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనను బీజేపీ నేతలు ఏ విధంగా ఉపయోగించుకుంటారోననేదే ప్రస్తుతం వేచిచూడాల్సిన అంశం.
Also read : TRS Rajyasabha Seats: రాజ్యసభ సీట్లను కేసీఆర్ బేరం పెట్టారా? సోషల్ మీడియాలో రచ్చ రచ్చ..
Also read : Hero Vijay Meet KCR: కేసీఆర్ తో తమిళ హీరో విజయ్ భేటీ.. బీజేపీకి వ్యతిరేకంగా ఏకమవుతున్నారా?
Also read : MLC Kavitha: జాతీయ పార్టీ కాదు.. తోక పార్టీ! రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసిన ఎమ్మెల్సీ కవిత...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.