ముస్లింల పవిత్రస్థలమైన మక్కా మసీదు ( Mecca masjid ) లో ఘోర ప్రమాదం తప్పింది. గుర్తు తెలియని దుండగుడు కారుతో లోపలకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించి అరెస్టయ్యాడు. సౌదీ అధికారులు ( Saudi officials ) దుండగుడి వివరాల్ని వెల్లడించలేదు.
ముస్లింలకు పవిత్రమైనది మక్కా మసీదు. సౌదీ అరేబియా ( Saudi Arabia ) లోని మక్కా మసీదు వద్ద సెక్యురిటీ ఎప్పుడూ పటిష్టంగానే ఉంటుంది. అయినా ఓ దుండగుడు కారుతో వేగంగా దూసుకొచ్చాడు. బ్యారికేడ్లు ధ్వంసం చేసి..మసీదు లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది వెంబడంచి పట్టుకున్నారు.
మసీదు దక్షిణ ద్వారాల్లో ఒకదానిని బలంగా ఢీ కొట్టడమే కాకుండా..లోపలకు దూసుకుపోయేందుకు విఫలయత్నం చేశాడు. అప్పటికే బయటున్న రెండు బ్యారికేడ్లను దాటేశాడు. మసీదు ప్రధాన ద్వారాన్ని ఢీ కొన్నాడు. అంతలో సెక్యూరిటీ సిబ్బంది పరుగున వచ్చి అరెస్టు చేశారు. దుండగుడి మతిస్థిమితం సరిగా లేదని స్వయంగా సౌదీ అరేబియా అధికారులే వెల్లడించారు. వ్యక్తి పేరు చెప్పడానికి అంగీకరించని సౌదీ అధికారులు...అసాధారణ స్థితిలో ఉన్నాడని మాత్రం స్పష్టం చేశారు. విచారణ కోసం అతడిని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయానికి తరలించారు.
కరోనా వైరస్ ( Corona virus ) సంక్రమణ నేపథ్యంలో మూతపడిన మక్కా మసీదు.. ఏడు నెలల అనంతరం ఇదే నెలలో తెరుచుకుంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఉమ్రా తీర్థయాత్రను నిలిపివేశారు. అతి ముఖ్యమైన హజ్ ( Hajj ) యాత్రను చరిత్రలో తొలిసారిగా అతి తక్కువమందితో నిర్వహించారు. కరోనా వైరస్ కు ముందు అంటే గత ఏడాది 2.5 లక్షల మంది దర్శించుకోగా..ఈసారి ఆంక్షల నేపధ్యంలో కేవలం పదివేలమంది స్వదేశీయులు మాత్రమే దర్శించుకోగలిగారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఇలా ఓ దుండగుడు మక్కా బారికేడ్లను ధ్వంసం చేసి దూసుకువెళ్లడం ఆందోళన కల్గిస్తోంది. Also read: Flying Car: ఎగిరే కారు సిద్ధం, ధర ఎంతో తెలుసా