భారతదేశంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ విభజన రాజకీయాలు నడుపుతున్నాయని నిందిస్తూ ఏఐఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ శనివారం మండిపడ్డారు. హైదరాబాద్‌లో జరిగిన ఒక సభలో ఆయన పైవిధంగా స్పందించారు.
"ఒకవైపు బీజేపీ ఏమో రాహుల్‌ను హిందువు కాదు అంటోంది. మరో వైపు కాంగ్రెస్ ఏమో మోదీ హిందువు కాదు అంటోంది. అలాంటప్పుడు ఒక ముస్లిం అయిన నేను వారిని ఎందుకు ప్రశ్నించాలి?" అంటూ పేర్కొన్నారు.
"శనివారం ఉత్తర ప్రదేశ్‌లో విడుదలైన అమేథీ నగర పంచాయితీ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ పై వెయ్యి ఓట్ల తేడాతో గెలిచింది. దీనిబట్టి అర్ధమవుతుంది బీజేపీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్‌కు ఎటువంటి వ్యూహాలు లేవని. ప్రధాని మోదీపై పోరాడటానికి వ్యూహాలు, శక్తి లేవని కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాలి" అంటూ ఒవైసీ ఎద్దేవా చేశారు.
"అమేథీ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ లోక్ సభ నియోజకవర్గం మరియు గాంధీ కుటుంబానికి కంచుకోట. అలాంటి చోట కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల్లో ఓడిపోయిందంటే.. వాళ్లే ఆలోచించుకోవాలి" అన్నారు.
గుజరాత్ ఎన్నికలపై కూడా ఒవైసీ మాట్లాడారు. గుజరాత్లో దళితులు, ఎస్సీ, ఎస్టీల తరువాత ముస్లింలు తీవ్రంగా వెనుకబడి ఉన్నారు.గుజరాత్లో 12 శాతం పటీదార్ తెగవారు ఉంటే 11 శాతం ముస్లింలు ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ గుజరాత్ శాసన సభ ఎన్నికల్లో 182 స్థానాలకు 32 మంది పటీదార్లకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వగా.. కేవలం రెండు మాత్రమే ముస్లింలకు కేటాయించింది. కాంగ్రెస్ పార్టీ పటీదార్లకు రిజర్వేషన్ ఇచ్చి.. ముస్లింలకు లాలీపా ప్ఇచ్చిందని ఒవైసీ ఎద్దేవా చేశారు.