Champions Trophy 2025: నేడే కీలకమైన దాయాది దేశాలైన భారత్ - పాకిస్థాన్ మ్యాచ్.. నరాలు తెగే ఉత్కంఠ..

Champions Trophy 2025: భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అంటే ప్రతి ఒక్కరిలో ఉత్కంఠ. క్రికెట్ అంటే ఇష్టం లేని వాళ్లు కూడా మైదానంలో భారత్, పాకిస్థాన్ తలపడితే చూసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటి ఉత్కంఠ భరితమైన మ్యాచ్ నేడు దాయాది దేశాల మధ్య జరగనుండంతో అందరి చూపు దానిపైనే ఉంది. 

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 23, 2025, 01:28 PM IST
Champions Trophy 2025: నేడే కీలకమైన  దాయాది దేశాలైన భారత్ - పాకిస్థాన్ మ్యాచ్.. నరాలు తెగే ఉత్కంఠ..

Champions Trophy 2025: ఛాంపియన్స్‌ ట్రోఫీలో మధ్యాహ్నం  భారత్‌,  పాకిస్తాన్‌ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌   రెండు జట్లకు అత్యంత కీలకం కానుంది. న్యూజిలాండ్‌ చేతిలో చిత్తుగా ఓడి ఆత్మవిశ్వాసం తగ్గిన పాకిస్థాన్‌కు ఈ మ్యాచ్‌ డై ఆర్‌ డై అన్నట్టుగా మారింది. ఈ మ్యాచ్‌ ఓడితే టోర్నీ నుంచి ఆ జట్టు వైదొలుగుతుంది. అప్పుడు 90వ దశకం తర్వాత మళ్లీ ఇంత కాలానికి ఐసీసీ టోర్నీకి ఆతిథ్యమిస్తున్న ఆనందమంతా  ఆవిరైపోతుంది. అందుకే ఎలాగైనా ఈ మ్యాచ్‌ గెలవాలనే పట్టుదలతో ఉంది పాకిస్తాన్‌. కానీ పాక్‌ ను ఓడించి ఒక మ్యాచ్‌ మిగిలి వుండగానే సెమీస్‌కు చేరాలని  రోహిత్‌ సేన పట్టుదలగా వుంది. టీమ్ ‌ఇండియా తన తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది.  

ఈ మ్యాచ్‌లో   అందరి కళ్లూ విరాట్‌ కోహ్లి మీదే ఉన్నాయి.పాకిస్థాన్‌పై  విరాట్‌కు గొప్ప రికార్డుంది. అయితే ప్రస్తుతం విరాట్‌ కోహ్లీ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. తొలి మ్యాచ్‌లో బలహీన బంగ్లాపైనా 22 పరుగులే చేసి ఔటయ్యాడు. స్పిన్‌ను అతను గతంలో మాదిరి ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోలేకపోతున్నాడు. పాక్‌తో మ్యాచ్‌ ముంగిట అతను నెట్స్‌లో స్పిన్నే ఎక్కువగా ప్రాక్టీస్‌  చేశాడు. ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌ల్లో సత్తా చాటుతాడని పేరున్న కోహ్లి.. తనలోని మేటి బ్యాటర్‌ను పాక్‌తో పోరులో బయటికి తీయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఇక కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తొలి మ్యాచ్‌లో మంచి ఫాంలోనే  కనిపించాడు. శుభ్‌మన్‌ సూపర్‌ ఫామ్‌ను కొనసాగిస్తూ ఇంకో సెంచరీ కొట్టేశాడు. రాహుల్‌ సైతం రాణించాడు. శ్రేయస్‌ గత మ్యాచ్‌లో విఫలమైనా అతను ఫామ్‌లోనే ఉన్నాడు. బౌలింగ్‌లో అందరి చూపూ షమి మీదే ఉంటుందనడంలో సందేహం లేదు. నిలకడగా రాణిస్తున్న ఈ సీనియర్‌ ఫాస్ట్‌బౌలర్‌.. బంగ్లాపై 5 వికెట్ల ప్రదర్శనతో సత్తాచాటాడు.  బుమ్రా లేని లోటు కనిపించకుండా చూశాడు. ఐసీసీ టోర్నీల్లో కొన్నేళ్లుగా గొప్పగా రాణిస్తున్న అతను.. పాక్‌పైనా అదే జోరును కొనసాగిస్తే భారత్‌కు తిరుగుండదు. షమికి  భాగస్వామి హర్షిత్‌ రాణా కూడా సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. తొలి మ్యాచ్‌లో అతను 3 వికెట్లు తీశాడు. జడేజా, అక్షర్, కుల్‌దీప్‌లతో భారత స్పిన్‌ విభాగానికి కూడా ఢోకా లేదు. పాక్‌తో మ్యాచ్‌లో భారత్‌ మార్పుల్లేని జట్టుతోనే బరిలోకి దిగనుంది.

ఇక  సొంతగడ్డపై  తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ అన్ని రకాలుగా తేలిపోయింది. న్యూజిలాండ్‌ బ్యాటర్లను ఆ జట్టు బౌలర్లు కట్టడి చేయలేకపోయారు. ప్రత్యర్థి బౌలింగ్‌కు బ్యాటర్లూ ఎదురు నిలవలేకపోయారు. భారత్‌పై ఆ జట్టు ఏమేర పోరాడుతుందో చూడాలి. కివీస్‌పై అర్ధశతకం సాధించినప్పటికీ స్టార్‌ బ్యాటర్‌ బాబర్‌ అజామ్‌ విమర్శల దాడిని తప్పించుకోలేకపోయాడు. భారీ లక్ష్యం ముందుండగా.. అతను మరీ నెమ్మదిగా ఆడడమే అందుకు కారణం. మిగతా బ్యాటర్లలో ఖుష్‌దిల్‌ షా ఒక్కడే పెద్ద ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ మ్యాచ్‌లో బాబర్, కెప్టెన్‌ రిజ్వాన్‌ ఎలాంటి ప్రదర్శన చేస్తారన్నది చూడాలి. వారు జట్టును ముందుండి నడిపించాలని పాక్‌ అభిమానులు కోరుకుంటున్నారు. ఫామ్‌లో ఉన్న సల్మాన్‌ ఆఘా నుంచి కూడా జట్టు పెద్ద ఇన్నింగ్స్‌ ఆశిస్తోంది. షహీన్‌ అఫ్రిది, హారిస్‌ రవూఫ్, నసీమ్‌ షా, అబ్రార్‌ అహ్మద్‌లతో కాగితంపై పాక్‌ బౌలింగ్‌ బలంగానే కనిపిస్తోంది. భారత్‌పై మంచి రికార్డున్న షహీన్‌.. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లను మేర ఇబ్బంది పెడతాడో చూడాలి.

ఇదీ చదవండి:   అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.

ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ మ్యాచ్‌లన్నింటికీ దుబాయే వేదిక. ఇక్కడి పిచ్‌ కొంచెం స్లోగా  ఉంటుంది. రన్స్‌ చేయడం అంత తేలిక కాదని భారత్‌-బంగ్లాదేశ్‌ మ్యాచ్‌లోనే అర్థమైంది. బంగ్లాదేశ్‌ ఇచ్చిన  229 రన్స్‌ ఛేజ్‌ చేసేందుకు  భారత్‌ కూడా కష్టపడింది. ఆదివారం కూడా పిచ్‌ ఇంతకంటే భిన్నంగా ఉండకపోవచ్చు. 270-280 పరుగులు చేస్తే మ్యాచ్‌ గెలవొచ్చు. బంగ్లాతో మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకోవడం పొరపాటని భారత్‌కు అర్థమయ్యే ఉంటుంది. పాక్‌పై టాస్‌ గెలిస్తే మాత్రం బ్యాటింగే చేసే అవకాశముంది.

ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..

ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News