Sreeleela Bollywood Entry : తెలుగులో ఇప్పటికే సెన్సేషనల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న శ్రీలీల త్వరలోనే బాలీవుడ్లోకి కూడా అడుగు పెట్టాలని తెగ ఎదురుచూస్తోంది. అయితే ఈ క్రమంలో ఆమె బాలీవుడ్ ఎంట్రీకి పెద్ద షాక్ ఇచ్చింది జాన్వి కపూర్ చెల్లెలు ఖుషి కపూర్. పూర్తి వివరాల్లోకి వెళితే..
టాలీవుడ్ లో చాలా తక్కువ సమయంలో టాప్ హీరోయిన్ గా ఎదిగిన శ్రీలీలకు ప్రస్తుతం బాలీవుడ్ ఎంట్రీపై మిశ్రమ అనుభవం ఎదురవుతోంది. వరుస తెలుగు చిత్రాలతో దూసుకుపోతున్న ఆమె తమిళ పరిశ్రమలో కూడా అడుగుపెట్టింది. తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ సరసన 'పరాశక్తి' చిత్రంలో నటిస్తున్న ఈ నటి.. సౌత్ లో మరిన్ని అవకాశాలను సొంతం చేసుకుంటూ స్టార్ హీరోయిన్గా దూసుకుపోతోంది. అయితే ఆమె హిందీ పరిశ్రమలో అడుగుపెట్టే ప్రయత్నాలు ఆశించిన మేరకు ఫలించలేదని తాజా సమాచారం.
ఇప్పటికే బాలీవుడ్ లో శ్రీలీల ఎంట్రీ గురించి పలు ఊహాగానాలు ఉన్నాయి. గత ఏడాదిలోనే ఆమె మొదటి హిందీ చిత్రం ప్రారంభమవ్వాల్సి ఉండగా, అనుకోని కారణాలతో ప్రాజెక్ట్ నిలిచిపోయింది. బాలీవుడ్ ఎంట్రీతో శ్రీలీల కెరీర్ మరింత మైలురాయి సాధిస్తుందని భావించినా, సినిమా ఆగిపోవడంతో ఆమెకు నిరాశ ఎదురైంది.
కొద్ది రోజుల క్రితం శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ ఖాయమని, సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ సరసన ఆమె నటించనుందని వార్తలు వచ్చాయి. ఇది ఇద్దరికీ మొదటి సినిమా అవుతుందని చెప్పుకున్నారు. కానీ తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం, శ్రీలీల స్థానంలో జాన్వి కపూర్ చెల్లెలు ఖుషి కపూర్ ను ఎంపిక చేసినట్లు బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి.
శ్రీలీలను ఈ ప్రాజెక్ట్ నుంచి ఎందుకు తప్పించారనే విషయం ఇంకా స్పష్టత రాలేదు. హిందీ మార్కెట్ లో ఆమెకు తగిన గుర్తింపు లేదని భావించారా? లేక మరేదైనా కారణమా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే, ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ నిర్మిస్తున్నట్లు సమాచారం. 'నడానియాన్' అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం ఖుషి కపూర్ ను ఎంపిక చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
బాలీవుడ్ ఎంట్రీ ఆగిపోవడంతో శ్రీలీల తిరిగి దక్షిణ భారత పరిశ్రమపైనే దృష్టి పెట్టింది. ఇటీవలే పాన్-ఇండియా సినిమా 'పుష్ప 2' లో ఐటెం సాంగ్ చేసిన ఆమె, మళ్ళీ కొత్త ప్రాజెక్టులతో బిజీ అవుతోంది. ఆమె కెరీర్ పై ఈ బాలీవుడ్ సినిమా ప్రభావం ఎంతవరకు ఉంటుందనేది కాలమే నిర్ణయించాలి.