హైదరాబాద్: మెఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ (MEIL) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5 కోట్ల విరాళం ప్రకటించింది. అందుకు సంబంధించిన చెక్కును సంస్థ ఎండి పివి కృష్ణారెడ్డి గురువారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మెగా సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. మానవాళిపై కరోనా వైరస్ చేస్తోన్న దాడిని తిప్పికొట్టేందుకు ప్రభుత్వాలు చేస్తోన్న యుద్ధంలో పలువురు పారిశ్రామికవేత్తలు, ప్రముఖ వ్యాపారులు తమ వంతు పాత్ర పోషిస్తూ ప్రభుత్వాలకు అండగా నిలుస్తున్నారు.
శాంతా బయోటెక్నిక్స్ అధినేత, పద్మభూషన్ కెఐ వరప్రసాద్ రెడ్డి ప్రగతి భవన్లో బుధవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలుసుకుని ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి వ్యక్తిగత సహాయంగా ఒక కోటి 116 రూపాయల చెక్కును ముఖ్యమంత్రికి వరప్రసాదర్ రెడ్డి అందించారు. అలాగే కెఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత కామిడి నర్సింహ రెడ్డి కూడా ముఖ్యమంత్రిని కలిసి తమ కంపెనీ తరుఫున కోటి రూపాయల చెక్కును సిఎం రిలీఫ్ ఫండ్‌కు అందించారు.
లారస్ ల్యాబ్స్ సిఇఓ డాక్టర్ సత్యనారాయణ, ఇ.డి. చంద్రకాంత్ చేరెడ్డి ముఖ్యమంత్రిని కలిసి తమ ల్యాబ్ తరపున ఒక లక్ష హైడ్రాక్సి క్లోరోక్విన్ టాబ్లెట్లను ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షల చెక్కును అందించారు.
హైదరాబాద్‌కు చెందిన మీనాక్షి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయల విరాళం అందించింది. అందుకు సంబంధించిన చెక్కును మీనాక్షి గ్రూప్ సంస్థ చైర్మన్ కె.ఎస్.రావు, ఎండి. సి.శివాజి బుధవారం ప్రగతి భవన్లో మంత్రి కెటి రామారావుకు అందించారు.
కరోనా వైరస్ పాజిటివ్ కేసులకు చికిత్స అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వ వైద్యులకు ఉపయోగపడేలా 4,000 N95 మాస్కులను జీపీకే ఎక్స్‌పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ (GPK exports and imports) యజమానులు ఫణి కుమార్, కర్నాల శైలజా రెడ్డి గురువారం నాడు ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు ప్రగతి భవన్లో అందజేశారు.
రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ 'క్రెడాయ్' సైతం ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.కోటి రూపాయల విరాళం అందించారు. క్రెడాయ్ తరపున ఆ సంస్థ ప్రతినిధులు రూ కోటి రూపాయల చెక్కును ప్రగతి భవన్లో మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారాక రామా రావుకు అందించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..